కర్నూలు కాదంటే ఉద్యమమే
రాజధానిపై తేల్చిచెప్పిన
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
కర్నూలులో అభిప్రాయాలు సేకరించిన శివరామకృష్ణన్ కమిటీ
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని పరిశీలించడానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే.. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కమిటీ మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నూతన ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలునే రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలులో పర్యటించింది.
కలెక్టరేట్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సమయంలో రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ఆడిటోరియంలోకి చొచ్చుకువచ్చి కమిటీ సభ్యుల్ని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణి గాంధీ, ఐజయ్య తమ అభిప్రాయాలను తెలుపుతూ.. 1956లో కర్నూలు ప్రజలు రాజధానిని త్యాగం చేశారని గుర్తు చేశారు.