ఆ మూడు జోన్లే మేలు
రాజధానికి 3 జోన్లు, 4 ప్రాంతాలను సూచిస్తూ శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదిక
3 జోన్లలో విశాఖ, రాయలసీమ, కాళహస్తి-నడికుడి మార్గం
4 ప్రాంతాల్లో గ్రేటర్ విశాఖ, విజయవాడ-గుంటూరు, నెల్లూరు, తిరుపతి - కాళహస్తి
ఏపీ రాజధాని ఏర్పాటుపై అధ్యయన కమిటీ అపాయింటెడ్ డే నుంచి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని విభజన చట్టం చెప్పింది. కానీ కమిటీ ఏర్పాటుకు మార్చి 28న నోటిఫికేషన్ ఇచ్చారు. మధ్యలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో 12 వారాల సమయాన్ని మాత్రమే వినియోగించుకోగలిగాం. 11 జిల్లాలో తిరిగి ప్రజాభిప్రా యాన్ని సేకరించాం. ఈ మెయిళ్ల రూపం లో 4,728 సలహాలు వచ్చాయి.
- కమిటీ
వైజాగ్ జోన్: ఈ జోన్‌లో విశాఖపట్నం అభివృద్ధి ప్రాధికార సంస్థ, శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఉంటుంది. ఇది హైటెక్ జోన్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంది. భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పోర్టులు ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో పెట్రోకారిడార్‌తో భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వందకు పైగా డెరైక్టరేట్లు, కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేయవచ్చు.
కాళహస్తి స్పైన్: ప్రతిపాదిత నడికుడి - కాళహస్తి రైలు మార్గం వెంట భారీ అభివృద్ధికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఈ మార్గం దోహదపడుతుంది. 300 కి.మీ. పొడవుండే ఈ మార్గం కృష్ణపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు, వినుకొండ రైల్వే జంక్షన్‌ను కలుపుతుంది. వైజాగ్-చెన్నై కారిడార్‌కు సమాంతరంగా ఈ రైల్వే లైను పనిచేస్తుంది.
రాయలసీమ ఆర్క్: కర్నూలు నుంచి చిత్తూరు వయా అనంతపురం, తిరుపతి, కడప ప్రాంతం. ఇక్కడ రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. ఈ ప్రాంతంలో హైదరాబాద్ - కర్నూలు - అనంతపురం - బెంగళూరు రహదారితో పాటు పలు కొత్త రహదారులు భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో ట్రాన్‌పోర్టు కారిడార్‌గా అభివృద్ధి అయ్యేందుకు దోహదపడుతాయి. అయితే ఈ ప్రాంతంలో నీటి లభ్యతకు గల అవకాశాలను తక్షణం సమీక్షించాల్సిన అవసరముంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు 3 జోన్లు, 4 పొటెన్షియల్ (మంచి అవకాశాలు గల) ప్రాంతాలను కె. సి. శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ ఈ నెల 27న తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సాయంత్రం ఈ నివేదికను పరిశీలించారు. కమిటీ తన నివేదికలో.. రాజధాని ఏర్పాటుకు సామర్థ్యం కలిగిన జోన్లుగా విజయవాడ-గుంటూరు, గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి-శ్రీకాళహస్తిలను గుర్తించింది. అయితే.. వీటిలో విజయవాడ- గుంటూరు ప్రాంతం అనేక కారణాల దృష్ట్యా సరికాదని వివరించింది. అలాగే.. అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని విశాఖ జోన్, రాయలసీమ ఆర్క్, కాళహస్తి-నడికుడి స్పైన్ రీజియన్లను గుర్తించినట్టు కమిటీ పేర్కొంది. రాజధాని ప్రాంతాన్ని గుర్తించేం దుకు 3 తరహాల్లో ఆలోచించినట్టు కమిటీ తెలిపింది. ఒకటి.. ఒకే చోట సూపర్ సిటీ ఏర్పాటు కోసం గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటు చేయడం. రెండోది.. ఉన్న నగరాలను విస్తరించడం. మూడోది.. అభివృద్ధిని వికేంద్రీకరించడం. ఈ మూడు కోణాల్లో ఆలోచించి పలు సిఫారసులు చేసినట్లు తెలిపింది.
అయితే.. ఒకే చోట సూపర్ సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కమిటీ కొట్టిపారేసింది. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే చోట భూమి దొరకడం కష్టమని పేర్కొంది. అందువల్ల ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది. హైదరాబాద్‌లో ఈ తరహా అభివృద్ధి చివరకు ఉమ్మడి రాష్ట్రం విభజనకు దారితీసిందని పేర్కొంది. అలాగే నగరాలను విస్తరించాలనుకున్న ప్రతిపాదనను కార్యరూపంలోకి తెస్తే సరైన అధ్యయనాలు, అంచనాలతో ముందుకు సాగాలని సూచించింది. తాత్కాలిక పద్ధతిలో ముందుకు సాగితే పర్యవసానాలు ప్రతికూలంగా ఉంటాయని చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ మార్గం ఎంచుకుంటే ఏ శాఖ కార్యాలయాలు ఎక్కడ ఉండాలో అధ్యయనం చేయాలని సూచించింది.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఇలా...
రాజధాని ఏర్పాటుకు మూడు జోన్లను గుర్తించిన కమిటీ.. ఆయా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాట్లను విస్తరించుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడింది. వైజాగ్ జోన్, శ్రీకాళహస్తి స్పైన్, రాయలసీమ ఆర్క్‌గా వీటిని పేర్కొంది. ఈ మూడు ప్రాంతాల విషయంలో కమిటీ సూచనలు ఇలావున్నాయి...
వైజాగ్ జోన్: ఈ జోన్‌లో విశాఖపట్నం అభివృద్ధి ప్రాధికార సంస్థ, శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఉంటుంది. ఇది హైటెక్ జోన్‌గా ఎదిగేందుకు అవకాశముంది.
రాయలసీమ ఆర్క్: కర్నూలు నుంచి చిత్తూరు వయా అనంతపురం, తిరుపతి, కడప ప్రాంతం. ఇక్కడ రాజధాని కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిగా ఉన్న కర్నూలును విస్మరించడం చారిత్రక తప్పిదమే అవుతుందన్న భావన ఈ ప్రాంతంలో అధికంగా ఉంది. శ్రీభాగ్ ఒప్పందం నిర్లక్ష్యానికి గురైందన్న వాదన ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు నీటిని ఎక్కడి నుంచో తెచ్చుకోగా లేనిది రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే తెచ్చుకోలేమా? అన్న వాదన ఉంది.
కాళహస్తి స్పైన్: ప్రతిపాదిత నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం వెంట భవిష్యత్తులో భారీ అభివృద్ధికి అవకాశముంది. 300 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం కృష్ణపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులు, వినుకొండ రైల్వే జంక్షన్‌ను కలుపుతుంది. గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి ఆధారిత నోడల్ నగరాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది.
విజయవాడ-గుంటూరు అవాంఛనీయం
విజయవాడ-గుంటూరుకు రాజధాని సామర్థ్యం ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు ఎందుకు వాంఛనీయం కాదో శివరామకృష్ణన్ కమిటీ సవివరంగా విశ్లేషించింది. విజయవాడకు నీటి లభ్యత, కనెక్టివిటీ మాత్రమే అనుకూల అంశాలనీ పేర్కొంది.
విజయవాడ-గుంటూరు పరిధిలో ఏవైనా కార్యాలయాలు ఏర్పాటు చేయదలిస్తే పరిణామాలు తీవ్రమవుతాయి. ప్రణాళిక లేని మౌలిక వసతుల విస్తరణ కష్టతరమవుతుంది. ఇతర ప్రాంతాల అభివృద్ధిపై పెను ప్రభావం పడుతుంది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేట్ కేంద్రంగా మారుతుంది.
దేశంలోనే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి అత్యుత్తమ సాగు భూములను కలిగి ఉండడమే కాకుండా.. దేశం మొత్తం వరి ఉత్పత్తిలో ఒక శాతానికి పైగా వాటా ఉంది. అంతేకాకుండా దేశ ధాన్యాగారంగా కూడా దీనికి పేరుంది.
విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం దాదాపు 7,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. వీజీటీఎం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కమిటీ బలంగా సిఫార్సు చేస్తోంది. హైదరాబాద్ తరహాలో ఇక్కడ రింగ్ రోడ్డు ప్రతిపాదన సరికాదని, రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడం మిన హా ఒరిగే దేమీ ఉండదని కమిటీ తేల్చిచెప్పింది.
సాగుభూములన్నీ నాశనమవుతాయి...
‘‘కమిటీకి అప్పగించిన విధివిధానాల్లో ప్రధానమైన ‘ప్రస్తుత సాగు భూములకు తక్కువ నష్టం వాటిల్లడం’ అనే అంశం ఆధారంగా చూస్తే.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి దేశంలో అత్యుత్తమ సాగుభూములున్న జిల్లాలు. గుంటూరులో దాదాపు 49 లక్షలు, కృష్ణాలో 45 లక్షల జనాభా ఉండగా.. గుంటూరులో 23.8 లక్షలు, కృష్ణాలో 20.48 లక్షల కార్మికులు, కూలీలున్నారు. ఈ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో గుంటూరులో 65 శాతం, కృష్ణాలో 56 శాతం కేవలం వ్యవసాయదారులు, రైతు కూలీలే. రింగ్ రోడ్డు వెంట ఏదైనా వ్యవసాయ క్షేత్రాల్ని వ్యవసాయేతర భూము లుగా మార్చాలని చూస్తే ఈ వర్క్‌ఫోర్స్ నిరుద్యోగులుగా మారుతారు. విలువైన వ్యవసాయ భూములను కోల్పోతాం.. చిన్న కమతాలు దూరమవుతాయి’’ అని కమిటీ వివరించింది.
తాత్కాలికం.. కొనసాగింపు: గుంటూరు, విజయవాడలో అదనపు ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని కమిటీ హెచ్చిరించింది. కేవ లం సీఎం, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాల వరకు పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది. త్వరితగతిన శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాన్ని పూర్తిచేసేలా ప్రయత్నించాలని సూచించింది.
రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ..
రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ.. రాష్ట్ర రాజధానిలో ఈ మూడు కీలకమైనవని.. రాజకీయ రాజధానికి ఇవి సంకేతాలని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది.
రాజ్‌భవన్‌కు 15 ఎకరాల భూమి అవసరమవుతుందని, ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిలో ఉన్న రాజ్‌భవన్‌ను వినియోగించుకుని.. కొంత కాలం తరువాత దీనిపై నిర్ణయించుకోవచ్చని పేర్కొంది.
రాష్ట్ర హైకోర్టు విషయంలో కూడా నాలుగైదేళ్ల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడింది. హైకోర్టును, వివిధ ట్రిబ్యునళ్లను విశాఖలో ఏర్పాటుచేసుకోవచ్చని, రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటుచేసుకోవచ్చని సూచించింది.
అసెంబ్లీ విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించింది. ఉత్తరాఖండ్‌లో తొలుత గైర్‌సేన్‌ను రాజధానిగా అనుకున్నప్పటికీ తాత్కాలికంగా డె హ్రాడూన్‌లో ఏర్పాటుచేసి దానిని ఇప్పటివరకు అలాగే కొనసాగిస్తున్నారని పేర్కొంది.
ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు అత్యవసరం అనుకుంటే తాత్కాలికంగా నూజివీడు, గన్నవరం, ముసునూరులను పరిశీలించవచ్చని పేర్కొంది.
డెరైక్టరేట్లు, కమిషనరేట్ల విషయంలో కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంలో, ఒంగోలులో పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత కార్యాలయాలు ప్రకాశం జిల్లాలో, అన ంతపురంలో విద్యకు సంబంధించిన కార్యాలయాలు, నెల్లూరులో సాగునీటికి, వైద్యానికి సంబంధించిన కార్యాలయాలు, కడపలో సంక్షేమానికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవచ్చని సూచించింది.
అవి అనధికార సూచనలే...
‘2014 జూలైలో ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కొంత సమాచారం ఇచ్చింది. అలాగే రాజధాని కోసం 8 ప్రాంతాలను సూచించింది. మధ్య ఆంధ్రలో ఉన్న ఈ ప్రాంతాలు విజయవాడ - గుంటూరుకు దగ్గరగా ఉన్నవే. ముసునూరు ఒక్కటే ఏలూరు సమీపంలో ఉంది. మిగిలినవి పులిచింతల, మాచర్ల, బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, మంగళగిరి. అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఈ ప్రతిపాదనలన్నీ అనధికారమేనని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదని మాతో చెప్పింది. అందువల్ల ఈ ప్రాంతాలపై మరింత లోతుగా సమీక్షించలేకపోయాం’’ అని కమిటీ వివరించింది.
రాష్ట్ర సర్కారు సమాచారం ఇవ్వలేదు...
రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉన్న భారీ క్లస్టర్లను సూచించాలని కమిటీ కోరినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ‘‘దురదృష్టవశాత్తూ కమిటీ కోరిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఇవ్వలేదు. జిల్లా కేంద్రాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను మాత్రమే పంపింది. ఈ భూములూ అసైన్డ్ భూములేనని తెలిసింది’’ అని కమిటీ వెల్లడించింది.
వెనుకబడిన ప్రాంతాల్లో ఆస్పత్రులు కావాలి
‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూనే స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొన్నాయి. ఇక్కడే చాలామంది ఆస్పత్రులపై పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రం విడిపోయాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సరైన ఆస్పత్రులే లేవు. పుట్టపర్తి, తిరుపతిలో మినహా ఎక్కడా స్పెషాలిటీ హాస్పిటళ్లు లేవు. బోధనాసుపత్రులు కూడా వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి.’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
రూ. 27,087 కోట్లు అవసరం
రాష్ట్ర రాజధానిలో భవనాలు, మౌలిక వసతులు, వంటి అంశాలకు పెట్టుబడులను శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. క్యాపిటల్ జోన్ భవనాలు, వసతులకు రూ. 10,519 కోట్లు, క్యాపిటల్ జోన్ మౌలిక వసతులకు రూ. 1,536 కోట్లు, నగర మౌలిక వసతుల నవీకరణకు రూ. 5,861 కోట్లు, నగర మౌలిక వసతుల విస్తరణకు రూ. 9,181 కోట్లు.. ఇలా మొత్తంగా 27,097 కోట్లు అవసరమని తెలిపింది.
సామర్థ్యం ఉన్న ప్రాంతాలు నాలుగు
రాజధాని ఏర్పాటుకు మూడు జోన్లను సూచించడమే కాకుండా.. నాలుగు పొటెన్షియల్ ప్రాంతాలను కూడా శివరామకృష్ణన్ కమిటీ గుర్తించింది. అవి విజయవాడ - గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి - కాళహస్తిలుగా పేర్కొంది. జిల్లా, రాజధాని ప్రాంతం, సరిపోయే సూచీ అనే అంశాలతో వాటిని విశ్లేషించింది. అందుకు.. నీరు, ప్రమాద అవకాశం (రిస్క్), అనుసంధానం (కనెక్టివిటీ), భూమి, ప్రాంతీయ అభివృద్ధి అనే ఐదు కీలక అంశాలను ఆధారంగా చేసుకుంది. నీటి విషయంలో 110 ఏళ్ల వర్షపాతం సగటును, సమీప నదీ జలాలను పరిగణనలోకి తీసుకుంది. రిస్క్ విషయంలో భూకంపాలు, తుపాన్లు, జనసాంద్రత-ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. కనెక్టివిటీ విషయంలో మెట్రో నగరాలు, ఇతర నగరాల దూరాన్ని, రైల్వే, విమాన, రోడ్డు కనెక్టివిటీని పరిగణనలోకి తీసుకుంది.
ఆ ప్రాంతాలది వేటికదే ప్రత్యేకత
అంశాల ప్రకారంగా చూస్తే.. విజయవాడ-గుంటూరు, గ్రేటర్ విశాఖ, నెల్లూరు, తిరుపతి-శ్రీకాళహస్తిలను కమిటీ గుర్తించింది. వీటిలో వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయని పేర్కొంది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా, విద్యాసంస్థలకు నెలవుగా ఉందని, నెల్లూరు.. కోస్తాంధ్ర, రాయలసీమకు మధ్యనున్న ముఖ్య నగరమని పేర్కొంది. విశాఖ భారీ పరిశ్రమలకు, పోర్టులకు నెలవుగా ఉందని చెప్పింది. విజయవాడ-గుంటూరు వ్యవసాయాధారిత అభివృద్ధి ప్రాంతమని, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతమని తెలిపింది. విశాఖలో అన్ని హంగులు ఉన్నా.. మిగతాప్రాంతాలతో కనెక్టివిటీ తక్కువని పేర్కొంది. రాయలసీమలోని అన్ని జిల్లా కేంద్రాలు అన్ని అంశాల్లోనూ మైనస్‌లో ఉన్నప్పటికీ ఒక్క కడప, తిరుపతిలో భూమి లభ్యత, కర్నూలులో కనెక్టివిటీ ఉందని పేర్కొంది.
భూసేకరణ భరించలేని కష్టం
విజయవాడ - గుంటూరులో రాజధాని కార్యకలాపాలు మొదలుపెడితే మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న భూమి చాలా స్వల్పమేనని పేర్కొంది. ‘‘ఏపీ ప్రభుత్వం అనధికారికంగా ఇంకో సూచన కూడా చేసింది. గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో రాజధాని కార్యకలాపాలను ప్రస్తావించింది. అయితే ఇక్కడ భూమి లభ్యత లేదు’’ అని స్పష్టంచేసింది. వీజీటీఎం ప్రాంతంలోని నూజివీడు, ముసునూరు, అమరావతి, పులిచింతల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటును పరిశీలించవచ్చని పేర్కొంది. వీజీటీఎంలోనే రాజధాని కార్యకలాపాలు ఏర్పాటుచేసుకోవాలనుకుంటే భూసేకరణ భరించలేని కష్టంగా మారుతుందని కూడా తేల్చిచెప్పింది.