నిమజ్జనంలో ముగ్గురు గల్లంతు, ఒకరు మృతి
సాక్షి, విజయనగరం/భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వేర్వేరు జిల్లాల్లో నదుల్లో మునిగి ముగ్గురు వ్యక్తులు గల్లంతుకాగా ఒకరు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలోని చంపావతి నదిలో విగ్రహంతోపాటు కుప్ప పోతురాజు(19) అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. టూటౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు కలిసి అతని కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల వద్ద గోదవరి నదిలో నిమజ్జనానికి వచ్చిన ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. వీరిని జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురానికి చెందిన వినయ్(20), శ్రీకాంత్(20)గా గుర్తించారు. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బస్సు కింద పడి ఒకరు మృతి
విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు కింద పడి రాజశేఖర్ అనే వ్యక్తి మృతిచెందాడు.ఇతనికి పెళ్లి అయి ఎనిమిది నెలలు అవుతున్నది. ప్రస్తుతం భార్య గర్భవతి.