నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : కాలువ ఆక్రమణలు తొలగించనందుకు కలెక్టర్ స్వయంగా హాజరుకావాలంటూ హైకోర్టు ఇచ్చిన నోటీసులతో రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసులతో కలిసి రంగంలోకి దిగారు. నెల్లూరు శివారులో ముత్తుకూరురోడ్డు సమీపంలో ఉన్న వడ్డిపాళెం పంట కాలువల వద్ద పేదలు వేసుకున్న 30 ఇళ్లను బుధవారం కూల్చేశారు. ఒక్కసారిగా ఇళ్లు కూల్చేయడంతో అనేకమంది పేదలు వీధినపడ్డారు.
వడ్డిపాళెం సమీపంలోని రెండు పంటకాలువల మధ్య 30 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలో కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని, పొలాలకు నీరు సరిగా పారడం లేదంటూ వడ్డిపాళేనికి చెందిన మల్లి సింహగిరి 2012లో హైకోర్టులో పిటీషన్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కాలువను ఆక్రమించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణలను తొలగించాలని రెండు నెలల క్రితం హైకోర్టు అధికారులను ఆదేశించింది.
అప్పట్లోనే అధికారులు ఇళ్లను కూల్చే ప్రయత్నం చేయగా కొందరి ఒత్తిళ్ల మేరకు తాత్కాలికంగా ఆపారు. కోర్టు ఉత్తర్వులను రెవెన్యూ అధికారులు ఖాతరు చేయడం లేదంటూ, కలెక్టర్‌ను బాధ్యుడిగా చేస్తూ సింహగిరి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు ఆక్రమణలను తొలగించడం, పంట కాలువలో పూడిక తీయడంతో పాటు కలెక్టర్ ఫిబ్రవరి 3న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. బాధితులకు పునరావాసం కూడా కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులో జాప్యం తన మెడకు చుట్టుకోవడంతో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులపై కలెక్టర్ శ్రీకాంత్ మండిపడ్డారు. మంగళవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
మోహరించిన పోలీసులు
ఆక్రమణల తొలగింపునకు మంగళవారం రాత్రే అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా బుధవారం వేకువజామున నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు సాంబశివరావు, జగన్‌మోహన్‌రావు, ఆరుగురు ఏఎస్సైలతో పాటు 100 మంది పోలీసులు వడ్డిపాళెంలో మోహరించారు. నెల్లూరు ఇన్‌చార్జి తహశీల్దార్ సాంబశివరావు, ఇందుకూరు పేట తహశీల్దార్ శీనానాయక్, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు వడ్డిపాళెం చేరుకుని ఇళ్ల కూల్చివేతను ప్రారంభించారు. పేదలమైన తమ ఇళ్లను కూల్చవద్దంటూ బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో 17 మందిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కన్నీరుమున్నీరైన పేదలు
ఇళ్లను ఒక్కసారిగా అధికారులు కూ ల్చివేయడంతో నిరాశ్రయులైన పేద లు కన్నీరుమున్నీరయ్యారు. కూలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు హడావుడిగా పైకప్పు రేకులు పగలకుండా స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. ఇళ్ల కూల్చివేతకు కారకుడైన సింహగిరిపై మండిపడ్డారు. ఇళ్లకు ఏమీ ఇబ్బంది లేదని నిన్నమొన్నటి వరకు నమ్మించిన సింహగిరి, ఇలా నట్టేట్లో ముంచుతాడని అనుకోలేదని వాపోయారు. అధికారులు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో ఆరుబయటే సామగ్రితో పడిగాపులు కాస్తున్నారు. వీరికి కొత్తూరు వద్ద స్థలాలు కేటాయించే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇళ్ల తొలగింపు ఎవరి కోసం !
కాలువల మధ్య పేదలు కట్టుకున్న ఇళ్లతో రైతులకు ఎలాంటి నష్టం లేదు. సింహగిరికి చెందిన 4.25 ఎకరాలకు సంబంధించిన కాలువ నీటి పారుదలకు యోగ్యంగానే ఉంది. ఓ పార్టీ నేతగా చెలామణి అవుతున్న సింహగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు వేయడం పేదలకు శాపంగా మారింది.
వడ్డిపాళెంలో 30 ఇళ్ల కూల్చివేత
Published Thu, Jan 30 2014 3:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement