సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశలవారీ మద్య నియంత్రణ చర్యలతో దశాబ్దాలుగా తాగుడుకు బానిసలైన వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 475 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే గతేడాది వంద షాపులను తగ్గించింది. ఈ ఏడాది మరికొన్ని దుకాణాలను తగ్గించడంతో ప్రస్తుతం 318 మద్యం షాపులే మిగిలాయి. గతంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుసంధానంగా నాలుగైదు బెల్టు షాపులుండేవి. రాష్ట్ర ప్రభుత్వం 2 వేలకుపైగా బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించడంతో ప్రశాంతత నెలకొంది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు కూడా భారీగా తగ్గాయి. షాక్ కొట్టేలా ధరలను పెంచడంతో పలువురు తాగుడును విడనాడి కుటుంబంతో కలసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఆరోగ్యంతోపాటు వ్యాపారమూ బాగుంది.
తొమ్మిదేళ్లుగా గ్రామంలో బిర్యానీ వ్యాపారం చేస్తున్నా. రోజూ సంపాదనలో ఎక్కువ భాగం మందుకే ఖర్చు చేసేవాడిని. ధరలు పెరగడంతో ఎనిమిది నెలలుగా తాగడం మానేశా. ఆరోగ్యం బాగుపడటంతోపాటు వ్యాపారం కూడా పెరిగింది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నా. ముఖ్యమంత్రి నిర్ణయంతో చాలా మంది మద్యానికి దూరం అవుతున్నారు.
– తుంగతుర్తి వెంకటరాజు, సీహెచ్ పోతేపల్లి, ద్వారకా తిరుమల మండలం
మందుతోనే ముఖం కడిగా..
నిరుపేద కుటుంబంలో జన్మించా. చదువు అబ్బలేదు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బంతా తాగుడుకే తగలేసేవాడిని. మందుతోనే ముఖం కడిగి మందుతోనే నిద్రపోయేవాడిని. పెళ్లి అయినా నేను మారలేదు. ఈ హింస భరించలేక పిల్లల భవిష్యత్తు కోసం నా భార్య కువైట్ వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లల్ని నానమ్మ, తాత వద్ద ఉంచి మళ్లీ మందులోనే మునిగిపోయా. జగనన్న మద్యాన్ని నియంత్రిస్తానంటే మా కడుపు కొడుతున్నాడని తిట్టుకున్నా. అంచెలంచెలుగా ధరలు పెంచి విక్రయాలను కట్టడి చేయడంతో తాగుడు పూర్తిగా మానేశా. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలతో గడుపుతున్నా.
–పుచ్చకాయల సత్యానందం, పాలకోడేరు మండలం
ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా..
నాకు 30 ఏళ్లుగా తాగుడు అలవాటు ఉంది. కూలి పనులు ఉన్నా లేకున్నా ప్రతి రోజూ తాగేవాడిని. ఏడాదిగా మద్యం రేట్లు విపరీతంగా పెరగడంతో తాగుడు మానుకున్నా. ఆ డబ్బును ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా.
– ఎంవీవీ సుబ్బారావు గోపాలపురం
Comments
Please login to add a commentAdd a comment