యనమల గొప్పేమిటో!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘ఆలూ లేదు..చూలూ లేదు..’ అన్న సామెత మాదిరిగా ఉంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనే లేదు. అప్పుడే తెలుగుతమ్ముళ్ల మధ్య మంత్రి పదవుల లొల్లి మొదలైంది. జిల్లాలో ఆ పార్టీ తరఫున 12 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో దాదాపు అరడజను మంది పార్టీలో సీనియారిటీ, సామాజిక నేపథ్యం, అధినేత చంద్రబాబుతో లాబీయింగ్ వంటి అంశాలు ప్రామాణికంగా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాల్ని బట్టి జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం దక్కవచ్చంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి కీలకమైన శాఖను, మరొకరికి పెద్దగా ప్రాధాన్యం లేని శాఖను కట్టబెడతారనే ప్రచారం ఆశావహుల మధ్య అగ్గి రాజేస్తోంది. పార్టీలో సీనియర్, తెరవెనుక చక్రం తిప్పే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి ఇదివరకు చేపట్టిన ఆర్థిక మంత్రిత్వశాఖనే కట్టబెడతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నపార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు సహకార, పశుసంవర్ధక వంటి ఏదో ఒక శాఖ కట్టబెడతారనే ప్రచారం నడుస్తోంది. ఎస్సీ కోటా నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు కూడా ప్రచారంలో ఉంది.
చంద్రబాబు వద్ద యనమల లాబీయింగ్!
తుని నుంచి వరుసగా ఆరు సార్లు గెలిచి, పలు కీలక పదవులు నిర్వర్తించిన యనమల రామకృష్ణుడిని ప్రజలు 2009 ఎన్నికల్లో తిరస్కరించారు. మొన్నటి ఎన్నికల్లో అదే తుని నుంచి వరుసకు సోదరుడైన కృష్ణుడిని వారసుడిగా పోటీ చేయించినా ఓటమి తప్పలేదు. మరోపక్క కడప జిల్లాలో టీడీపీ నుంచి పోటీ చేసిన యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కూ శృంగభంగం తప్పలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో చతికిలబడడమే కాక తన వారిని గెలిపించుకోలేని ఆయనకు కీలకమైన మంత్రి పదవి ఎలా కట్టబెడతారని జిల్లాలో మిగిలిన సీనియర్లు అంటున్నారు.
యనమల ఎమ్మెల్సీ కోటాలో కీలక మంత్రి పదవిని దక్కించుకుని జిల్లాలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యం లేని పదవికి పరిమితం చేయాలన్న ఎత్తుగడతో బాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం ఆ పార్టీలో పెను దుమారాన్నే రేపుతోంది. చంద్రబాబు అలా చేయరనే నమ్మకం లేదని, గతంలో సీఎంగా ఉండగా తమ వర్గానికి కట్టబెట్టిన అప్రధానమైన పదవులే అందుకు సాక్ష్యమని వారంటున్నారు. బలమైన నాయకుడైన జ్యోతుల నెహ్రూను మంత్రి కాకుండా అడ్డుకున్న యనమల తన వర్గీయుడైన మెట్ల సత్యనారాయణరావుకు వైద్యారోగ్యశాఖ కట్టబెట్టేలా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. చిక్కాల రామచంద్రరావుకు ప్రాధాన్యం లేని సహకారశాఖను కట్టబెట్టడం వెనుక యనమల ఉన్నారని జిల్లా రాజకీయాలపై కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారికీ తెలుసంటున్నారు.
పెందుర్తి, వేగుళ్ల వర్గీయుల ఆగ్రహం
యనమల ఇప్పుడు కూడా ఆ పంథానే అనుసరిస్తున్నా, ఇప్పటికిప్పుడు బయటపడకుండా సమయం వచ్చినప్పుడు స్పందిద్దామనే యోచనలో యనమల వైరిపక్షం ఉంది. యనమలను వ్యతిరేకించే విషయంలో కాపు ఎమ్మెల్యేలు, చంద్రబాబు సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఏకీభావంతో ఉన్నారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి రాకుండా యనమల మోకాలడ్డుతున్నారని ఆయన వర్గం ఎమ్మెల్యేలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఎమ్మెల్యేలుగా రెండోసారి గెలుపొందిన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు వర్గీయులు కూడా యనమలకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యంపై ఒకింత అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమలో మంత్రి పదవి ఎవరికిచ్చినా ఫర్వాలేదని, ఎవరికీ ఇవ్వకపోతే మాత్రం ఉపేక్షించేది లేదని ఆ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేబినెట్ కూర్పు ఎలా ఉంటుందో, జిల్లాలో టీడీపీపై దాని ప్రభావం ఎలా ఉంటుందో తేలాలంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు.