ఎవరిని నమ్మాలి?
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజడ్) : భూ సేకరణ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు చెరో మాటా మాట్లాడుతున్నారు. తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో కేఎస్‌ఈజడ్ భూములు ఉన్నాయి. తుని నియోజకవర్గానికి చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ భూముల సేకరణపై వినిపిస్తున్న పరస్పర విరుద్ధ వాదనలు బాధిత రైతులను అయోమయంలోకి నెడుతున్నాయి. కేఎస్‌ఈజడ్ వ్యతిరేక పోరాట కమిటీని అసహనానికి గురి చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :గతంలో కేఎస్‌ఈజడ్‌ను, భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైఖరి మార్చుకుంది. మొదట్లో భూ సేకరణపై రైతుల పక్షాన నిలిచినట్టు ప్రకటించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా జిల్లా ముఖ్య నేతలు ఆందోళన బాట పట్టారు. అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని, కేఎస్‌ఈజడ్ జీఓనే రద్దు చేస్తామని ప్రకటించారు. తీరా అధికారం చేపట్టాక మాట మార్చి రైతులందరికీ న్యాయం జరిగిన తరువాతే భూములు తీసుకునేలా చేస్తామని ఆర్థిక మంత్రి యనమల, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
తీరా కేఎస్‌ఈజడ్‌లో యాంకర్ పరిశ్రమలు వచ్చేందుకు సిద్ధపడుతున్న తరుణంలో వారిద్దరూ చెరోమాటా మాట్లాడుతూ అయోమయాన్ని సృష్టిస్తున్నారు. వీరిద్దరి తీరుపై కేఎస్‌ఈజడ్ బాధిత రైతులు, కేఎస్‌ఈజడ్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో వారి మాటలపై నమ్మకం ఉంచి సర్కార్‌తో చర్చలకు వెళ్లిన పోరాట కమిటీ పాలకపక్ష ప్రజాప్రతినిధుల తీరును తప్పు పడుతోంది.
నష్టపరిహారం చెల్లించి సేకరించిన భూములు మినహా ఇతర భూములను తీసుకోవడం లేదని యనమల స్వయంగా చెప్పారని పోరాట కమిటీ చెబుతోంది.
అలా కాక, మొత్తం భూమినంతటినీ కేఎస్‌ఈజడ్ కోసం తీసుకుంటామని యనమల అన్నట్టు ఎమ్మెల్యే వర్మ చెబుతున్నారని పోరాట కమిటీ గురువారం కాకినాడలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి ఎమ్మెల్యే వర్మ పేరుతో బుధవారం విడుదలైన ప్రకటనలో రిజిస్ట్రేషన్ అయిన భూములకు ఒకరకంగా, అవార్డు ప్రకటించిన భూములకు మరోరకంగా ఆర్థిక ప్రయోజనాన్ని మంత్రి యనమల కల్పించనున్నారని ఉంది. యనమల మాత్రం అలా అనలేదని, నష్టపరిహారం చెల్లించిన భూములు మినహా ఇతర భూములు తీసుకోవడం లేదని చెప్పారని పోరాట కమిటీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. యనమల మాటలను వర్మ వక్రీకరిస్తున్నారని వారు అంటున్నారు.
కొత్త చట్టం అమలు చేస్తామంటేనే చర్చలు..
యనమల, వర్మల ప్రకటనల్లో ఏది నికరమన్నది పక్కన పెడితే కేఎస్‌ఈజడ్ వ్యతిరేక పోరాట కమిటీ మాత్రం ఇక చర్చలకు వెళ్లేది లేదని చెబుతోంది. కొత్త భూ సేకరణ చట్టం అమలు చేస్తామంటేనే ప్రభుత్వంతో చర్చలకు వెళతామని కమిటీ ప్రతినిధులు గురువారం నాటి సంయుక్త పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త భూ సేకరణ చట్టం అమలు చేయకుంటే చర్చలకు వెళ్లేది లేదని కేఎస్‌ఈజడ్ ప్రతినిధులు చింతా సత్యనారాయణమూర్తి, పెనుమళ్ల సుబ్డిరెడ్డి, దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి అయినాపురపు సూర్యనారాయణ తెలిపారు. ప్రముఖ సంఘ సేవకులు మేధా పాట్కర్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ కమిషనర్ బీడీ శర్మ, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే, హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం వంటి ఎందరో ప్రముఖులు రైతుల పక్షాన నిలవగా, అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా అందరితో కలిసి సహకరించిందని గుర్తు చేశారు. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించామన్నారు. కేఎస్‌ఈజడ్ భూములపై యనమల ఇచ్చిన హామీలను రైతులకు వివరించి భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు.
టీడీపీ శ్రేణుల ఆగ్రహం
మొత్తం మీద కేఎస్‌ఈజడ్ భూ సేకరణలో పంథా మార్చిన టీడీపీకి మంత్రి, ఎమ్మెల్యేల పరస్పర విరుద్ధ ప్రకటనలు కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్టే. తమ నేతలు ఎన్నికల ముందు ఒకరకంగా, ఎన్నికలయ్యాక మరో విధంగా మాట్లాడుతుండటంతో నిర్వాసిత రైతుల్లో చులకనైపోయామని అసలే టీడీపీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ఇది చాలదా అన్నట్టు ఇప్పుడు యనమల, వర్మ చెరో మాటా మాట్లాడడం వారిని ఆగ్రహానికి లోను చేస్తోంది.