
పెళ్లింట విషాదం... వధువు మృతి
విజయవాడ: కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం వద్ద కాల్వలోకి సాంత్రో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మరొకరు గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల్లో వధువుతో పాటు బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం నవ వధువుతోపాటు ఆరుగురు పెళ్లి బృందం సాంత్రో కారులో చల్లపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.