
మరికొద్ది ఘడియల్లో పెళ్లి... అంతలోనే ...
విజయవాడ: మరికొద్ది ఘడియల్లో పెళ్లి .... సంతోషంగా ప్రాణ స్నేహితురాలితోపాటు కుటుంబ సభ్యులతో కలసి కారులో వివాహనికి బయలుదేరింది. ఇంతలో మృత్యువు అధిక వేగం రూపంలో ఆమెతోపాటు స్నేహితురాలిని కబళించింది. అంతా కన్ను తెరచి మూసేలోగా ఈ ఘటన కొన్ని సెకన్లలో జరిగిపోయింది. హృదయాన్ని కలచి వేసిన ఈ సంఘటన బుధవారం కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపల్లి రహదారి పక్కనే ఉన్న కాల్వ వద్ద చోటు చేసుకుంది. వధువు ధరించిన నగలు చెల్లచెదురుగా పడి పోయాయి. ఆమె వేసుకున్న పూల దండ కాల్వలోని చెట్టుపై పడింది.
వధువు, ఆమె స్నేహితురాలు, ఏడేళ్ల బాలుడుతోపాటు మరో ఇద్దరు కారులో చల్లపల్లి నుంచి గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో వల్లూరుపల్లి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. దాంతో కారులోని నవ వధువు అల్లంశెట్టి బాలాకుమారి (అమ్ములు)తోపాటు ఆమె స్నేహితురాలు నాగచంద్ర మృతి చెందారు. ఏడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడింది.
దాంతో సహాయక చర్యలు నిలిపివేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన విజయవాడకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు క్రేన్ల సహాయంతో కారును కాల్వ నుంచి బయటకు తీశారు. ప్రమాద వార్త తెలియగానే వధువు కుటుంబసభ్యులతోపాటు వరుడి కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు.