ఓటర్ల ఆధార్ సీడింగ్ అంతంతే
మొత్తం ఓటర్లు 30,91,455
పూర్తయిన అనుసంధానం 19,29,319
ఐదు నియోజకవర్గాల్లో పురోగతి అధ్వాన్నం
కర్నూలులో 29.89 శాతం మించని ప్రక్రియ
కుప్పలుతెప్పలుగా బోగస్ ఓటర్లు
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చేపట్టిన ఆధార్ అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 30,91,455 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 70 శాతం ఓటర్ల నుంచి వివిధ రూపాల్లో ఆధార్ నెంబర్లు సేకరించారు. ఇప్పటి వరకు 19,29,319 మంది ఓటర్లను మాత్రమే బీఎల్‌ఓలు ఆధార్‌తో అనుసంధానించారు. ఈ లెక్కన ఆధార్ సీడింగ్ 62.41 శాతం మాత్రమే పూర్తయింది. 11,62,136 మంది ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయాల్సి ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 25 నాటికి అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జిల్లాలో బోగస్ ఓటర్లు లెక్కకు మించి ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం అంతంతమాత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం బీఎల్‌ఓలు చేస్తుండగా.. వీటిని ఈఆర్‌ఓలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. బీఎల్‌ఓలు 19,29,319 మంది ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఈఆర్‌ఓలు కేవలం 2,67,940 పరిశీలించి ఆమోదం తెలిపారు.
తక్కినవి పెండింగ్‌లో పెట్టారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ అంతంత మాత్రమే. ఆదోని నియోజకవర్గంలో 2,15,311 మంది ఓటర్లు ఉండగా.. ఆధార్ సీడింగ్ 1,04,342 మాత్రమే(48.46 శాతం) చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో 53.83 శాతం, ఎమ్మిగనూరులో 57.21 శాతం, ఆలూరులో 58.78 శాతం మాత్రమే ప్రగతి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో 63 శాతం పైగా ఆధార్ సీడింగ్ పూర్తయింది.
కర్నూలు కార్పొరేషన్‌లో 29.89 శాతమే
కర్నూలు నగరానికి చెందిన 19,700 ఓటర్లకు ఇంటి నంబర్లు లేవు. ఏరియా(లొకేషన్) లేదు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, తండ్రి పేరు, సీరియల్ నెంబరు తప్ప వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇంటి అడ్రస్ వివరాలు లేవు. కానీ ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ పోల్ అవుతున్నాయి. ఇవన్నీ బోగస్ ఓటర్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కర్నూలు నగరపాలక సంస్థలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం 29.89 శాతానికే పరిమితమయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,135 మంది ఓటర్లు ఉండగా.. 73,568 మంది ఓటర్లను మాత్రమే ఆధార్‌తో అనుసంధానించారు.
నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష
కర్నూలు నగరపాలక సంస్థలోని ఓటర్లపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఈఆర్‌ఓలు, తహశీల్దార్లతోను సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు.
సగంతో సరి!
Published Fri, May 15 2015 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement