పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి | YSRCP MPs Approach Central Election Commission Over TDP Bogus Votes | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్ల వ్యవహారం.. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి

Published Thu, Dec 14 2023 3:47 PM | Last Updated on Thu, Dec 14 2023 6:16 PM

YSRCP MPs Approach Central Election Commission Over TDP Bogus Votes - Sakshi

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)ని కలిసింది. పీపుల్స్‌ రిప్రెజెంటేషన్‌ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఘటనలను వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

సీఈసీ భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...ఓటర్ల జాబితాల సమాచారంతో లబ్ధి పొందాలనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాల్ని వైఎస్‌ఆర్‌సీపీ పసిగట్టింది. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్‌ డాట్‌ కామ్‌’ పేరిట ఆ పార్టీ వెబ్‌సైట్‌ కుట్రల్ని...సెక్షన్‌ 123(3) పీపుల్స్‌ రిప్రెజెంటేషన్‌ యాక్ట్‌ను ఉల్లఘిస్తున్న విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ను ఈరోజు మేము కలిశాము. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము వినతిపత్రం అందించాం. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌ప్రాక్టీస్‌పై అనేక అంశాల్ని కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించాం. వన్‌ సిటిజన్‌ .. వన్‌ ఓట్ అనే మాపార్టీ సిద్ధాంతాన్ని తెలియపరిచాం. ప్రధానంగా ఓటర్ల కులాల వివరాలు సేకరణ, పొలిటికల్‌ పార్టీ ప్రయార్టీపై తెలుగుదేశం చేస్తున్న డేటా సేకరణను ఆధారాలతో సహా సీఈసీకి చెప్పాం. వాటన్నింటిపై కమిషన్‌ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. 

 ‘మైపార్టీ డ్యాష్‌బోర్డ్‌ డాట్‌కామ్‌’తో మాల్‌ప్రాక్టీస్...
ఎన్నికల కమిషన్‌ డ్యాష్‌బోర్టులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్‌ డాట్‌కామ్‌’లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతోపాటు అతను సపోర్టు చేసే పొలిటికల్‌ పార్టీ, మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలున్నాయి. అంటే, రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరు చేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా మేము ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చాం. తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్‌ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్‌ పాయింట్‌ వద్ద స్టోర్‌ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్‌ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్‌ ద్వారా సేకరించడం...అప్పట్లో ఆ యాప్‌పై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తదనంతరం దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న సంగతిని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్‌’ ద్వారా టీడీపీ చేపట్టిన చట్టవిరుద్ధమైన  కార్యక్రమంపై 120(బి), 379,420,188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్‌) కింద చర్యలు తీసుకోవాలని మేము ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాము.

టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌తో మరో కుట్ర…
ఓటరు అంగీకారంతో సంబంధంలేకుండా ఓట్లను ఉంచాలా.. తొలగించాలా అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ మరో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంది. మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్‌ ద్వారా సేకరించిన డేటా మొత్తం న్యూయార్క్‌ సర్వర్‌లో దాస్తుంటే.. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌ డేటా మొత్తాన్ని లండన్‌లోని మరో సర్వర్‌లో స్టోర్‌ చేస్తూ ఉన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌ పేరిట ఎన్నికల కమిషన్‌ డ్యాష్‌ బోర్టులో ఇమేజ్‌ ఫార్మేట్‌లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్‌ ఫార్మేట్‌లోకి మార్చి ప్రతీ 30 ఓట్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్‌కు అప్పగిస్తారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిలా, ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరిగా తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులమేంటి..? వాళ్ల పొలిటికల్‌ గుర్తింపేంటి..? వారు ఏ రకమైన బెనిఫిట్స్‌ పొందుతున్నారు..? వారు ఆరాధించే మతమేంటనే వివరాలతో ఓటర్ల వ్యక్తిగతమైన డేటాను సేకరించడమనేది చట్టవిరుద్ధమని మేము ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించాము. 

‘బాబు ష్యూరిటీ...భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు...
తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం ఆ పార్టీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒకభాగమైతే.. 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనేది లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులు అందచేసినట్లు మేము ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాము. 

4.36 లక్షల డూప్లికేట్‌ ఓట్లను గుర్తించాం...
ఓటర్ల పేర్లలో ఒకటో రెండో అక్షరాలను మార్పు చేసి వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లు పేర్కొంటూ ఓట్లు చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. తండ్రి పేరు మార్చడమో లేదంటే భర్తకు భార్య పేరు మార్చడమో ఇలాంటి చిన్నచిన్న మార్పులతో డూప్లికేట్‌ ఓట్లను తయారు చేసుకునేందుకు ఆ పార్టీ తెగించిందనేది తెలుసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్‌ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్‌ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని కూడా ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి.. వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాము.

తెలంగాణలో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున...అక్కడున్న ఆంధ్రప్రదేశ్‌ సెటిలర్స్‌  రేపటి ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఓటర్ల చేర్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చాం. 

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ప్రోత్సహించరాదు...
తెలుగుదేశం పార్టీ ఎలక్షన్‌ సెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ అయిన కోనేరు సురేష్‌ అనే వ్యక్తి డూప్లికేటింగ్, డబుల్‌ ఎంట్రీస్, నాన్‌ లోకల్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లు...వాటిపై ఎంక్వైరీ చేయాలని గతంలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు ఆ ఫిర్యాదుపై ఎంక్వైరీలు చేయాలని ఆదేశాలొచ్చాయి. అయితే, సదరు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఫిర్యాదులో నిజం లేదని తేలింది. దీనినిబట్టి కోనేరు సురేష్‌ అనే వ్యక్తి ఎన్నికల సంఘం సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్ధం చేసుకోవాలి. దీనిపై వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి పది లక్షల మంది ఓటర్ల తరఫున మా ఓట్లు ఒరిజినలా... బోగస్‌వా వెరిఫై చేయండని కోరగలరా? అని అడుగుతున్నాము. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి...విలువైన ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సమయాన్ని వృథాపరచడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సిందిగా సీఈసీకి వివరించాం.

చదవండి:    మార్చిలోనే ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement