Voters Aadhaar seeding
-
నోటా.. అభ్యర్థులకు టాటా!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతి ఓటు విలువైనదే. గతంలో పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే ఓటు వేసేవారు కాదు. మన కెందుకులే అని ఇంట్లో ఉండేవారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ‘నోటా’ను ప్రవేశపెట్టింది. పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే నోటా వినియోగించుకునే అవకాశమివ్వడంతో చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి నోటాను వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వేల మంది ఓటర్లు నోటాను నొక్కి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. అధికారులు నోటా గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లు కచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని, అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించడని అవగాహన కల్పించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 101 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొత్తం 13,25,207 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 12,330 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నోటా ను వినియోగించుకున్న ఓటర్లు 13,527 మంది ఉ న్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 2,212 మంది ఓటర్లు నోటాను వినియోగించుకున్నారు. అలాగే నోటా వినియోగంలో బాల్కొండ నియోజకవర్గం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 2,006 మంది నోటాను వినియోగించుకున్నారు. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్‌లో 708 మంది నోటాను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలు చూస్తే పోటీ అభ్యర్థులకు ఓటర్లు చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు సూచనతో... 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమలు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే విధానాన్ని అమలు చేసింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రిం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ పరిస్థితుల నడుమ నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రిం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెలువరించింది. తిరస్కరణ ఓటు ఎప్పటి నుంచో అమల్లో ఉంది.. వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 (ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌బూత్ లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి దీని కోసం 17–ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్ పెట్టేలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో నోటాను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంత మంది ‘నోటా’ నొక్కుతారో... ఈవీఎంపై నోటా బటన్ రావడంతో 2014 ఎన్నికల్లో 13 వేలకు పైగా ఓటర్లు నోటాను వినియోగించుకుని అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని తిరస్కరించారు. అయితే ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఎంత మంది నోటాను వినియోగించుకుంటారోననే అంశం ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కుపై ప్రస్తుత యువతకు పూర్తి అవగాహన ఉండడం, పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల గురించి అంతా తెలిసి ఉండడంతో నోటా నొక్కేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని తెలుస్తోంది. -
సగంతో సరి!
ఓటర్ల ఆధార్ సీడింగ్ అంతంతే మొత్తం ఓటర్లు 30,91,455 పూర్తయిన అనుసంధానం 19,29,319 ఐదు నియోజకవర్గాల్లో పురోగతి అధ్వాన్నం కర్నూలులో 29.89 శాతం మించని ప్రక్రియ కుప్పలుతెప్పలుగా బోగస్ ఓటర్లు కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చేపట్టిన ఆధార్ అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 30,91,455 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 70 శాతం ఓటర్ల నుంచి వివిధ రూపాల్లో ఆధార్ నెంబర్లు సేకరించారు. ఇప్పటి వరకు 19,29,319 మంది ఓటర్లను మాత్రమే బీఎల్ఓలు ఆధార్‌తో అనుసంధానించారు. ఈ లెక్కన ఆధార్ సీడింగ్ 62.41 శాతం మాత్రమే పూర్తయింది. 11,62,136 మంది ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 25 నాటికి అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జిల్లాలో బోగస్ ఓటర్లు లెక్కకు మించి ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం అంతంతమాత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం బీఎల్ఓలు చేస్తుండగా.. వీటిని ఈఆర్ఓలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. బీఎల్ఓలు 19,29,319 మంది ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఈఆర్ఓలు కేవలం 2,67,940 పరిశీలించి ఆమోదం తెలిపారు. తక్కినవి పెండింగ్‌లో పెట్టారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ అంతంత మాత్రమే. ఆదోని నియోజకవర్గంలో 2,15,311 మంది ఓటర్లు ఉండగా.. ఆధార్ సీడింగ్ 1,04,342 మాత్రమే(48.46 శాతం) చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో 53.83 శాతం, ఎమ్మిగనూరులో 57.21 శాతం, ఆలూరులో 58.78 శాతం మాత్రమే ప్రగతి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో 63 శాతం పైగా ఆధార్ సీడింగ్ పూర్తయింది. కర్నూలు కార్పొరేషన్లో 29.89 శాతమే కర్నూలు నగరానికి చెందిన 19,700 ఓటర్లకు ఇంటి నంబర్లు లేవు. ఏరియా(లొకేషన్) లేదు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, తండ్రి పేరు, సీరియల్ నెంబరు తప్ప వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇంటి అడ్రస్ వివరాలు లేవు. కానీ ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ పోల్ అవుతున్నాయి. ఇవన్నీ బోగస్ ఓటర్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కర్నూలు నగరపాలక సంస్థలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం 29.89 శాతానికే పరిమితమయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,135 మంది ఓటర్లు ఉండగా.. 73,568 మంది ఓటర్లను మాత్రమే ఆధార్‌తో అనుసంధానించారు. నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష కర్నూలు నగరపాలక సంస్థలోని ఓటర్లపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఈఆర్ఓలు, తహశీల్దార్లతోను సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు.