నోటా.. అభ్యర్థులకు టాటా!  | Nizamabad Voters Use To Nota Symbol | Sakshi
Sakshi News home page

నోటా.. అభ్యర్థులకు టాటా! 

Published Sat, Dec 1 2018 11:39 AM | Last Updated on Sat, Dec 1 2018 12:32 PM

Nizamabad Voters Use To Nota Symbol - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతి ఓటు విలువైనదే. గతంలో పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే ఓటు వేసేవారు కాదు. మన కెందుకులే అని ఇంట్లో ఉండేవారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ‘నోటా’ను ప్రవేశపెట్టింది. పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే నోటా వినియోగించుకునే అవకాశమివ్వడంతో చాలా మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి నోటాను వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వేల మంది ఓటర్లు నోటాను నొక్కి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. అధికారులు నోటా గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లు కచ్చితంగా పోలింగ్‌ కేంద్రాలకు రావాలని, అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించడని అవగాహన కల్పించారు.

ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 101 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొత్తం 13,25,207 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 12,330 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. నోటా ను వినియోగించుకున్న ఓటర్లు 13,527 మంది ఉ న్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 2,212 మంది ఓటర్లు నోటాను వినియోగించుకున్నారు. అలాగే నోటా వినియోగంలో బాల్కొండ నియోజకవర్గం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 2,006 మంది నోటాను వినియోగించుకున్నారు. అత్యల్పంగా నిజామాబాద్‌ అర్బన్‌లో 708 మంది నోటాను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలు చూస్తే పోటీ అభ్యర్థులకు ఓటర్లు చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

సుప్రీం కోర్టు సూచనతో... 
2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమలు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే విధానాన్ని అమలు చేసింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రిం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ పరిస్థితుల నడుమ నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రిం కోర్టు 2013 సెప్టెంబర్‌ 27న తీర్పును వెలువరించింది.
 
తిరస్కరణ ఓటు ఎప్పటి నుంచో అమల్లో ఉంది..
వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 49 (ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌బూత్‌ లోని ప్రిసైడింగ్‌ అధికారి దగ్గరికి వెళ్లి దీని కోసం 17–ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్‌ పెట్టేలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్‌ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో నోటాను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.

ప్రస్తుత ఎన్నికల్లో ఎంత మంది ‘నోటా’ నొక్కుతారో... 
ఈవీఎంపై నోటా బటన్‌ రావడంతో 2014 ఎన్నికల్లో 13 వేలకు పైగా ఓటర్లు నోటాను వినియోగించుకుని అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని తిరస్కరించారు. అయితే ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఎంత మంది నోటాను వినియోగించుకుంటారోననే అంశం ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కుపై ప్రస్తుత యువతకు పూర్తి అవగాహన ఉండడం, పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల గురించి అంతా తెలిసి ఉండడంతో నోటా నొక్కేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement