సాక్షి, అమరావతి: కళ్లు బైర్లుకమ్మేంతగా మెరుపులు.. ఆ వెంటనే చెవులకు చిల్లులు పడేలా.. గుండెలు గుభేల్‌మనేలా.. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఫెళఫెళమంటూ ఉరుములు.. పిడుగులు.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఆ ఒక్క రోజే 41,025 పిడుగులు పడి 14 మంది మృత్యువాతపడ్డారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది పిడుగు పోట్లు అధికమయ్యాయి. వేసవి సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ రోజూ ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మే ఒకటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకంగా 1,40,982 పిడుగులు పడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం వీటి కారణంగా 39 మంది మృత్యువాత పడ్డారు. అధికారుల దృష్టికి రాని మరణాలు దాదాపు ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ గణాంకాల ప్రకారం 2017 మే నుంచి అక్టోబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 2,62,940 పిడుగులు పడగా.. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారుల దృష్టికి రాని మరణాలు ఇంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.
వేసవిలోనే అధికం
ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రభావం వేసవి కాలంలోనే అధికంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి.. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదవుతుంటాయి. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. ఈ సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశంలో నల్లని దట్టమైన క్యూములో నింబస్ మేఘాలు అలుముకుంటాయి. ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. వీటిని ఇంగ్లిష్‌లో థండర్ స్ట్రోమ్స్ అని అంటారు.
భూతాపం పెరగడమే కారణం
మండు వేసవిలో భూతాపం, వడగాడ్పుల నుంచి ఈ థండర్ స్ట్రోమ్స్ ఉపశమనం కలిగిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ చెప్పారు. ‘వేసవి కాలంలో మధ్యాహ్నం వరకూ తీవ్రమైన వేడి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత క్యూములో నింబస్ మేఘాలు అలుముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, వడగండ్లు పడుతుంటాయి. వీటినే థండర్ స్ట్రోమ్స్‌అంటారు. వేసవిలో సంభవించే వీటిని భూతాపం తగ్గించేందుకు ప్రకృతి ప్రసాదించిన వరాలుగా చెప్పొచ్చు. మెరుపులన్నింటినీ పిడుగులుగా చాలామంది భ్రమపడుతుంటారు.
వాస్తవంగా మెరుపులు రెండు రకాలు.. ఆకాశంలో ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొనడం వల్ల విద్యుదాఘాతం ఏర్పడుతుంది. దీనిని మెరుపు అంటారు. మేఘంలోని అణువులు ఢీకొట్టుకోవడం వల్ల ఆకాశం నుంచి భూమికి చేరే విద్యుదాఘాతాన్ని పిడుగు అంటారు. ఆకాశం నుంచి భూమికి పిడుగు పడుతున్నప్పుడు స్పష్టంగా పైనుంచి కిందకు మెరుపు తీగ కనిపిస్తుంది. గతం కంటే ఇప్పుడు మెరుపులు, పిడుగులు పెరిగాయి. ఇందుకు భూతాపం అధికం కావడమే కారణం’ అని డాక్టర్ కేజీ రమేష్ వివరించారు. గతంలో పిడుగుపాట్లకు సంబంధించిన ముందస్తు సమాచారం కనుక్కునే పరిజ్ఞానం లేదు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయాన్ని అరగంట ముందే కనుగొనగల పరిజ్ఞానం అందుబాటులోకొచ్చింది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
పిడుగుపాట్ల వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోతున్నాయి. చెట్లు, భవనాలు కూలిపోయిన ఘటనలూ ఉన్నాయి. మే ఆరంభమైనందున ఎండ తీవ్రత పెరగనుంది. వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఉరుములతో పాటు పిడుగులు పడే ప్రభావం కూడా అధికమవుతుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుడు నరసింహారావు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
– మబ్బులు కమ్ముకుని చినుకులు పడే సూచనలు కనిపించినా.. గాలులు వీస్తున్నా.. ఉరుములు ఉరిమినా పిడుగులు పడే ప్రమాదం ఉందని గుర్తించాలి. దగ్గర్లోని పెద్ద భవనాల్లోకి వెళ్లడం ఉత్తమం.
– ఉరుములు, మెరుపులు, గాలీవాన సమయంలో బైక్‌లు నడపరాదు.
– బహిరంగ ప్రదేశాల్లో సెల్ ఫోన్లు వాడరాదు.
– ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూడదు.
– ఉరుముల సమయంలో ఇళ్లలో ఉన్న వారు తలుపులు, కిటికీలు మూసివేయాలి.
Comments
Please login to add a commentAdd a comment