నయవంచకుడు
చేసేది ‘లైన్’మెన్ ఉద్యోగం.. సమాజంలో హుందాగా వ్యవహరిస్తూ.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అతను. పెళ్లై, పిల్లలున్న విషయాన్ని దాచి పెట్టి మరో అమ్మాయిని ‘లైన్’లో పెట్టాడు. లైన్ కనెక్ట్ కాగానే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఆ తరువాత ‘దగ్గర’య్యాడు. ఎలాగోలా అతని విషయం ఆమెకు తెలిసింది. నిలదీస్తే.. మొదటి భార్యకు విడాకులిచ్చి, నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ క థలు చెప్పాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. - ఉరవకొండ
బూదగెవికు చెందిన శ్రీచరణ్ ఉరవకొండ ట్రాన్స్‌కో శాఖ పరిధిలో జూనియుర్ లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ విషయం దాచి ఉంచి ఉరవకొండకు చెందిన మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ‘నాకింకా పెళ్లి కాలేదు. నువ్వు ఓకే అంటే నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ’ ఆమెను నమ్మించాడు. ఆ అభాగ్యురాలు నిజమేనని నమ్మింది. ఓకే అంది. మరింత చొరవ తీసుకున్న అతను ‘ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా’ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కూడా కాదంది.
నిలదీస్తే.. బిత్తరపోయాడు
పెళ్లై, కొడుకు ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు శ్రీచరణ్‌ను అడిగింది. ఊహించని ఈ పరిణామంతో అతని నోటి వెంట మాటలు తడబడ్డాయి. తనకింకా పెళ్లి కాలేదని మళ్లీ నమ్మించేం దుకు ప్రయత్నించాడు. గట్టిగా నిలదీసే సరికి అవునని అంగీకరించాడు. ఎందుకిలా చేశావంటే ‘నీకోసమే’నంటూ మళ్లీ బుకాయించాడు. ‘నా భార్యకు విడాకులిచ్చి, నిన్నే పెళ్లి చేసుకుంటా’నంటూ కాళ్లబేరానికి వచ్చాడు. అంతలోనే అభాగ్యురాలి కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగి పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ అతనిపై ఒత్తిడి తీసుకురావడంతో ఆ నయవంచకుడు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. చేసేది లేక బాధితురాలు న్యాయం కోసం ఎస్‌ఐ మోహన్‌కుమార్‌గౌడ్‌ను ఆదివారం కలసి రాతమూలకంగా ఫిర్యాదు చేసింది. నయవంచకుడిపై 417, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.