అమాత్యుల భూపందేరం
నెల్లూరులో 431 ఎకరాల
సర్కారు భూమి రిసార్ట్స్‌పరం
చెన్నై కార్పొరేట్ సంస్థకు అడ్డంగా భూ మినహాయింపులు
కిరణ్, రఘువీరా నిర్వాకం..
సీసీఎల్‌ఎ వద్దన్నా పట్టించుకోని వైనం
నిబంధనలకు విరుద్ధంగా జీవో..
దాని అమలుకు కలెక్టర్ ససేమిరా
జీవో రద్దుకు కలెక్టర్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ
ముఖ్య కార్యదర్శి సిఫార్సు
పట్టించుకోని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఓ కార్పొరేట్ సంస్థపై ముఖ్యమంత్రి కిరణ్, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అంతులేని ఔదార్యం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఎకరాల్లో వ్యవసాయ భూ పరిమితి మినహాయింపు ఇచ్చేశారు. అది సర్కారు భూమి అని నిర్ధారణ అయినా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్‌తో పాటు సాక్షాత్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్) కూడా వద్దంటున్నా విన్పించుకోలేదు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వివాదమవుతుందని హెచ్చరించినా ఖాతరు చేయలేదు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలు గ్రామంలో ఎకరం రూ.2 లక్షలకు పైగా పలికే 431.81 ఎకరాల సర్కారు భూమిని చెన్నైకి చెందిన ఎస్‌ఎఫ్‌ఆర్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరం చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి జీవో జారీ చేయించారు. వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి ఆ భూమికి మినహాయింపు ఇస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా 533 జీవోను జారీ చేశారు. ఆ జీవోను అమలు చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కానీ అందుకు కలెక్టర్ ససేమిరా అన్నారు. ‘‘అది ప్రభుత్వ భూమి. అక్కడ పర్యాటక కేంద్రం, హోటల్ ఏర్పాటు అసాధ్యం’’ అని స్పష్టం చేశారు. జీవోను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా కలెక్టర్ వాదననే సమర్థించారు. జీవో రద్దుకు సిఫార్సు చేస్తూ ఫైలును వారు కిరణ్‌కు, రఘువీరాకు పంపారు. కానీ అందుకు వారిద్దరూ తిరస్కరించారు.
అడ్డగోలు వాదన
నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలు గ్రామంలోని సర్వే నంబర్ 339లోని 431.81 ఎకరాలను వ్యవసాయేతర వినియోగానికి, పర్యాటకాభివృద్ధికి కొనుగోలు చేశామని, దానికి వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఆర్ రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డెరైక్టర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ ఎస్‌ఎఫ్‌ఆర్ కొనుగోలు చేసింది ఇనాం భూమి అని, కొందరు పెద్దలు దాన్ని బోగస్ పట్టాలతో విక్రయించారని పేర్కొంటూ, దానిపై విచారణ జరపాలని కోరుతూ కలెక్టర్‌కు గుండవోలు సర్పంచ్ వినతిపత్రం సమర్పించారు
ఎస్‌ఎఫ్‌ఆర్ సంస్థ ఆ భూమిని 1997 నుంచి 1999 మధ్యలో 33 పట్టాదారుల నుంచి కొనుగోలు చేసినట్టు నెల్లూరు ఆర్డీవో తేల్చారు. దాన్ని వ్యవసాయ భూ పరిమితి చట్టం కింద మిగులు భూమిగా ప్రకటించాలని పేర్కొంటూ భూ సంస్కరణల ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఎస్‌ఎఫ్‌ఆర్‌కు నోటీసిచ్చారు.
కానీ ఆ భూమిని కంపెనీ పేరిట కొనుగోలు చేశామని, అందులో పర్యాటక వ్యాపారం చేస్తామని, హోటల్ నిర్మాణం చేపడతామని సంస్థ పేర్కొంది. అందుకే వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని పేర్కొంది.
50 ఎకరాలకే అర్హత
కంపెనీ పేరిట ఉన్నది 431.81 ఎకరాలు కాగా, వ్యవసాయ భూ పరిమితి చట్టం కింద దానికి 50 ఎకరాల మినహాయింపుకే అర్హత ఉందని ఆర్డీవో స్పష్టం చేశారు. మిగతా 381 ఎకరాలను మిగులు భూమిగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, ఆ మేరకు భూ సంస్కరణల ట్రిబ్యునల్ ముందు 2009 సెప్టెంబర్ 30లోగా స్వాధీన పత్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించారు. కానీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దానిన మిగులు భూమిగా ప్రకటించాలని ఎన్నిసార్లు నోటీసులిచ్చినా స్పందించలేదు.
కండలేరు నిర్వాసితుల గోడు వినలేదు
నిజానికి మిగులు భూమిలోని 60 ఎకరాలను కండలేరు రిజర్వాయర్ నిర్వాసితులైన 880 కుటుంబాలకు సహాయ పునరావాస చర్యలకు కేటాయించారు. అక్కడ బోర్‌వెల్స్‌తో పాటు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన లే ఔట్‌ను తయారు చేశారు. త్వరలో టెండర్లను పిలవనున్నారు.
లోకాయుక్త ఏమందంటే..
మిగులు భూమిని 2009 సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిందిగా కంపెనీని లోకాయుక్త ఆదేశించింది. భూమిని స్వాధీనం చేసుకుని నివేదిక సమర్పించాల్సిందిగా ఆర్డీవోకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కంపెనీ నెల్లూరు భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయగా 2011 ఏప్రిల్ 8న అప్పీల్‌ను అది కొట్టేసింది.
లోకాయుక్త, అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాపూర్ మండలం తహసీల్దారు కంపెనీ నుంచి 381 ఎకరాల భూమిని 2011 జూన్ 8న స్వాధీనం చేసుకున్నారు.
భూమిని స్వాధీనం చేసుకున్నట్టు లోకాయుక్తకు తహసీల్దారు నివేదిక సమర్పించారు. ట్రిబ్యునల్ తీర్పుపై కంపెనీ 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కోర్టు 2011 జూన్ 22న మధ్యంతర స్టే విధించింది. అయితే మిగులు భూమిని జూన్ 8వ తేదీనే స్వాధీనం చేసుకున్నందున ఆ తీర్పు నిష్పలమే అవుతుందని ప్రభుత్వం భావించింది.