సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం 47వ రోజూ ఉధృతంగా సాగింది. ఆదివారం సీమాంధ్రలో నిరసనలు హోరెత్తాయి. వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమైక్యవాదులు తమ నిరసనను తెలియజేశారు. ఇంజినీర్స్ డే సందర్భంగా శ్రీకాకుళంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఉద్యోగులు రక్తదానం చేశారు. పురపాలక సంఘం ఉద్యోగులు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించారు. విజయనగరంలో బీజేపీ జిల్లా సమావేశాలను అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పెనుగొండ ల్లో విద్యార్థులచే భారీర్యాలీలు జరిగాయి.
కొవ్వూరు వశిష్టనదీ తీరంలో గోదావరిమాతకు సమైక్య హారతి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో క్రైస్తవులు నల్లవంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. పిఠాపురం సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై ప్రార్థనలు చేశారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై కోనసీమ కవులు ‘సమైక్యనాదం’ అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఏయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. షర్మిల యాత్ర విజయవంతం కావాలని కోరుతూ గోపాలపట్నం, వేపగుంట ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. అనకాపల్లిలో రూ.20లకు టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రతిఏటా ఘనంగా జరుపుకునే ఓనం వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు విజయవాడలో స్థిరపడిన మళయాళీలు ప్రకటించారు. ఐసీడీఎస్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
గుం టూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన క్రైస్తవుల నిరసన ప్రదర్శనలో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో డాక్టరు జె.కోటినాగయ్య ఆధ్వర్యంలో నెహ్రూరోడ్డులో పిచ్చాస్పత్రి నిర్వహించి సోనియాగాంధీ, బొత్ససత్యనారాయణ వేషధారణలో ఉన్నవారికి చికిత్స లందించారు. ఉద్యమ నేపథ్యంలో పెరిగిన కూరగాయల ధరలతో పాటు నిత్యావసర సరుకుల రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని డిమాండ్‌చేస్తూ నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం, తాడిపత్రిలో ముస్లింలు నిరసన ర్యాలీ తీయగా, శింగనమల, కనగానపల్లిలో సమైక్యవాదులు జలదీక్ష చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైష్ణవి పుష్కరిణిలో జలదీక్ష చేశారు. చంద్రగిరి కోట సమీపంలోని దుర్గంకొండపై 15 కిలోల కర్పూరంతో సమైక్య జ్యోతి వెలిగించి నిరసన తెలిపారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 1956 మంది రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, కడపలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.
కర్నూలులో చాణక్యపురి కాలనీవాసులు కురవ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చగా, ఆళ్లగడ్డలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు.
మరో నలుగురి హఠాన్మరణం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన భయంతో ఆదివారం మరో నలుగురు గుండెపోటుతో మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెకు చెందిన పెద్ద మునెయ్య(45), కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటకు చెందిన నాగశేషుడు(35), పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నివాసి రవికుమార్ (35) గుండెపోటుతో మరణించారు. అలాగే, విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన హేమంత్ శ్రీనివాస్ (25) టీవీలో విభజన వార్తలు చూస్తూ కలత చెంది కుప్ప కూలిపోయి అక్కడే ప్రాణాలొదిలాడు.