ఇంద్రకీలాద్రిపై నాల్గవరోజు జగన్మాత శ్రీఅన్నపూర్ణాదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్తజనబాంధవి, అన్నార్తుల పాలిట అన్నపూర్ణమ్మగా అందరింటా పూజలందుకునే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరారు. ఓ వైపు కుంకుమార్చనలు, మరోవైపు చండీయాగం, వేదఘోషతో కృష్ణాతీరం బుధవారం పులకించింది. సెలవు దినం కలసి రావడం పిల్లా–పెద్దా కొండకు బారులు తీరారు. క్యూలైనులన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. వచ్చిన ప్రతిభక్తుడికి సులభంగా ‘అమ్మ’ దర్శనం లభించేలా.. సంతృప్తిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లేలా యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి.
సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ) : అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిట లాడాయి. సర్వదర్శనం, రూ. 100 టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 300, వీఐపీ క్యూలైన్‌లో నాలుగు గంటల సమయం పట్టింది. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీయాగంలో ఉభయదాతలు పాల్గొన్నారు.
అంతరాలయం దర్శనం రద్దు
రూ. 300, వీఐపీ టికెట్లు, ఉత్సవ కమిటీ సభ్యుల సిఫార్సుతో దర్శనానికి విచ్చేసిన భక్తులతో ప్రత్యేక క్యూలైన్ మార్గంలో రద్దీ కనిపించింది. దీంతో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అయితే ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
క్యూలైన్‌లో సీపీ టికెట్ల తనిఖీ
వీఐపీ క్యూలైన్‌లో రద్దీ అధికంగా ఉండటం, ఆర్జీత సేవలలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనం ఆలస్యం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానానికి విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు క్యూలైన్లను పరిశీలించారు. దీంతో సీపీని పలువురు భక్తులు నిలదీయడంతో ఆయన క్యూలైన్‌లో ఉన్న భక్తుల వద్ద టికెట్లను తనిఖీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఎటువంటి టికెట్లు లేకుండా దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉండటం గమనించారు. దీనిపై ఈవో ఎంవీ. సురేష్‌బాబుతో మాట్లాడారు. అంతే కాకుండా వీఐపీలకు కేటాయించిన సమయంలోనే దర్శనానికి అనుమతించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీఐపీల పేరిట వచ్చేవారు దేవస్థానం నిర్ణయించిన సమయంలోనే క్యూలైన్‌లోకి అనుమతిస్తామని పోలీసులు సిబ్బంది పేర్కొనడంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది.
మార్మోగిన పురవీధులు
ఆలయాల్లో నిత్య పూజలు అందుకునే ఆది దంపతులు, దసరా మహోత్సవాల సందర్భంగా పల్లకిలో ఊరేగుతూ తమ మధ్యకు రావడంతో భక్తజనం పులకించారు. కోలాట నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, పంచ వాయిద్యాలతో నగరోత్సవం కోలాహలంగా సాగింది. యాగశాల నుంచి ప్రారంభమైన ఈకార్యక్రమం మహా మండపం, కనక దుర్గనగర్, కెనాల్‌రోడ్డు, వినాయకుడి గుడి, దుర్గాఘాట్, మీదగా ఆలయానికి చేరుకుంది.
శ్రీచక్ర సంచారిణే
వన్‌టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ నిత్యం శ్రీచక్రంలోనే సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయ కారిణి, లోకమాతగా పేర్కొనే జగన్మాత నిత్యం కొలు ఉండే పవిత్ర స్థలమే శ్రీచక్రమే. ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి. అయితే లలితాదేవే దుర్గమ్మ, ఈ దుర్గమ్మే లలితాదేవని, రెండిటికీ బేధం లేదని పండితులు చెబుతారు. పూర్వం ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మను శంకరాచార్యులవారు దర్శించారు. ఆమెను శాంతపరిచేందుకు శ్రీచక్రాన్ని దుర్గమ్మ సన్నిధిలో ప్రతిష్టించారు. అమ్మవారికి నిర్వహించే పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహించాలని సూచించారు. అప్పటి నుంచి అమ్మవారి సన్నిధిలో పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహిస్తున్నారు. లోకపావని కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర నవావరణార్చన నిత్యం అత్యంత వైభవంగా జరుగుతోంది. లలితా త్రిపురసుందరీ దేవికి సాక్షాత్తూ లక్ష్మీ, సరస్వతులే వింజామరులు విసురుతూ సేవలందిస్తుంటారు.
అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రం రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది భూప్రస్తరం. ఇది యంత్ర రూపంలో ఒక రాగి లేక వెండి రేకు మీద రేఖలతో చెక్కించబడి ఉంటుంది. రెండోది మేరు ప్రస్తరం. ఇది శ్రీచక్రంలోని బిందు త్రికోణాది రేఖలు, వృత్తాలు, దళాలు పైకి శిఖరంలాగా కనిపించేలా పోతపోయబడి ఉంటుంది. ఈ మేరు ప్రస్తరం శ్రీ చక్రం నవావరణార్చన జరపటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో లక్ష కుంకుమార్చన జరిగే అమ్మవారి దగ్గర, నిత్యపూజల అమ్మవారి దగ్గర, నవావరణార్చన దగ్గర మేరు ప్రస్తమైన శ్రీచక్రాల్నే ప్రతిష్టించడం జరిగింది. వాటికే అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. సాధారణ పూజలకు భిన్నంగా శ్రీచక్ర నవావరణార్చన జరగడం విశేషం.
శక్తి ప్రధానమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షించటానికి కారణం ఇక్కడ నిరంతరం శ్రీచక్రానికి జరుపబడే పూజలే. అందుకే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా శ్రీచక్రానికి నిత్యం శాస్త్రోక్తంగా పూజలను నిర్వహిస్తారు. ఈ పూజల నిమిత్తం దేవస్ధానం ప్రత్యేకంగా ఒక అర్చకుడిని సైతం నియమించింది. అనుకున్న కొర్కెలు తీరటం కోసం, ఐశ్వర్య ప్రాప్తికోసం, వ్యాపారాభివృద్ధి కోసం, సమస్త శుభాలు జరగటం కోసం ఈ అర్చనను అందరూ జరిపించుకుంటారు.
దుర్గమ్మ సేవలో పీవీపీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బుధవారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పీవీపీని ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న పీవీపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు.
ప్రముఖుల రాక
దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్‌లో మాట్లాడారు.
దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్‌లో మాట్లాడారు.
నాల్గో రోజు ఆదాయం రూ. 35.56 లక్షలు
దసరా ఉత్సవాలలో నాల్గో రోజున దేవస్థానానికి రూ. 35.56 లక్షల మేర ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ. 12.75 లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ. 7.10 లక్షలు, వీఐపీ టికెట్ల దర్శనం రూ. 1.62 లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం రూ. 8.40 లక్షలు, లక్ష కుంకుమార్చన టికెట్ల విక్రయం ద్వారా రూ. 66 వేల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడో రోజున దేవస్థానానికి మొత్తంగా రూ. 32.90 లక్షల మేర ఆదాయం సమకూరింది. గత ఏడాది దసరా ఉత్సవాలలో మూడో రోజున దేవస్థానానికి రూ. 42.97 లక్షల మేర ఆదాయం సమకూరగా, ఈ ఏడాది సుమారు రూ. 10 లక్షల మేర ఆదాయం తగ్గింది.
–ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)
నేటి అలంకారంశ్రీ లలితా త్రిపుర సుందరీదేవి
దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజు గురువారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరుకు గడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment