కోరుకున్న చోటు..అరకోటి రేటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వారం, పది రోజుల్లో తమ శాఖలో జరిగే బదిలీలపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోలీసు బదిలీలనగానే.. కొందరు నేతలు తమకు నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకుంటారు. మరి కొందరు నేతలు, బ్రోకర్లు లక్షలు దండుకోవడానికి ఇదే మంచి అవకాశమనుకుంటారు. అలాంటి వారి పంట పండిస్తూ కొన్ని సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం ఇద్దరికంటే ఎక్కువ మంది పోటీ పడుతూ లక్షలు కుమ్మరించేందుకు సైతం వెనుకాడటం లేదు. రాజమండ్రి అర్బన్ జిల్లా మినహాయిస్తే జిల్లాలో ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం, అమలాపురం పోలీసు సబ్‌డివిజన్లలో, సర్కిళ్లలో సీఐ పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఆయా సర్కిళ్లలో తెరచాటు వ్యవహారాలు, ప్రైవేటు సెటిల్‌మెంట్‌లతో లక్షలు చేతులు మారడమే ఇందుకు కారణమంటున్నారు. కీలక సర్కిళ్లలో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ముట్టచెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు పైరవీలకు తెరతీశారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పది ఈ జిల్లాయే కావడంతో పైరవీల జోరు కాస్త అధికంగానే ఉంటోంది. మంత్రి సైతం ఎమ్మెల్యేలు అభీష్టానికి భిన్నంగా సిఫార్సులు చేసే పరిస్థితి ఉండదంటున్నారు. దీంతో నియోజకవర్గ నేతలు, వారి అనుచరగణం భారీగానే సిఫార్సు లేఖలతో క్యూ కడుతున్నారు.
కాకినాడలో ఓ వ్యాపారి,టీడీపీ నేతలే సూత్రధారులు
జిల్లాలో నాలుగు డీఎస్పీ, 56 సర్కిల్ ఇన్‌స్పెక్టర్, 144 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులున్నాయి. కాకినాడ పోలీసు సబ్‌డివిజన్‌లో కాకినాడ వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు, సర్పవరం పోలీస్ స్టేషన్లు ఎస్‌హెచ్‌ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్-సీఐ) స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. నగరంలోని సెంట్రల్‌క్రైం స్టేషన్‌తో పాటు కాకినాడ రూరల్ సర్కిల్, సర్పవరం, వన్‌టౌన్, టూటౌన్, పోర్టు స్టేషన్‌లలో సీఐ పోస్టుల కోసం గట్టి పోటీ నెలకొంది. కాకినాడ నగర పరిధిలో పోస్టింగ్‌ల కోసం క్యూలో ఉన్న పోలీసు అధికారులతో నగరంలో అధికారపార్టీకి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త, పార్టీ నాయకుడు బేరసారాలు జరుపుతున్నారు. సిటీ నియోజకవర్గానికి చెందిన నేత తన వద్దకు పోస్టింగ్‌ల కోసం వచ్చే వారిని అన్ని విషయాలూ ఆ వ్యాపారవేత్తతో మాట్లాడాలని సూచిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న అద్దంకి శ్రీనివాసరావు టూటౌన్, త్రీటౌన్, పోర్టు పోలీసు స్టేషన్‌లకు ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన ఇక్కడకు వచ్చి ఎనిమిది నెలలవుతోంది. ఈ సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. వన్‌టౌన్ సర్కిల్ పరిధి విస్తృతం కావడంతో ఈ పోస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానిస్టేబుళ్లు కూడా ఈ స్టేషన్‌లో పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారంటే ఇక ఇన్‌స్పెక్టర్ స్థాయికి పోటీ ఎలా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ బంగ్లా వంటి వీఐపీ ఏరియా టూ టౌన్ పరిధిలోనే ఉండటంతో అక్కడి సీఐ పోస్టింగ్‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. ప్రముఖ ఫ్యాక్టరీలు, ఆయిల్ కంపెనీలు, పోర్టు వంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు సర్పవరం స్టేషన్ పరిధిలో ఉండడంతో ఇక్కడి ఎస్‌హెచ్‌ఓ పోస్టు కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. పోర్టు, టూటౌన్ పోలీసు స్టేషన్‌లలో పోస్టింగ్‌ల కోసం ఒకపక్క సిటీ నేత, మరోపక్క కాకినాడ పార్లమెంటు స్థాయి నాయకుడొకరు సిఫార్సు లేఖలతో సిద్ధమవడంతో ఈ పోస్టింగ్‌లపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
అక్కడ పోస్టు రేటు రూ.25 లక్షలు
రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్‌లో రామచంద్రపురం, మండపేట రూరల్, మండపేట టౌన్, అనపర్తి సర్కిళ్లలో పోస్టింగ్‌లకు కూడా మంచి గిరాకీ ఉంది. వీటిలో మండపేట, అనపర్తి సర్కిళ్లలో పోస్టు పాతిక లక్షలు పలుకుతోంది. పెద్దాపురం డివిజన్‌లో పెద్దాపురం, జగ్గంపేట, తుని సర్కిళ్లలో ఇన్‌స్పెక్టర్‌ల పోస్టులకు గట్టి పోటీయే కనిపిస్తోంది. అమలాపురం డివిజన్‌లో అమలాపురం టౌన్, రాజోలు, రావులపాలెం సర్కిళ్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. రావులపాలెం, అమలాపురం టౌన్ కోసం ఎక్కువ మంది పోటీపడుతున్నారు. హోం మంత్రి చినరాజప్ప సొంత నియోజకవర్గం కావడం, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడ పోస్టింగ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తోంది. ఏజెన్సీకి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో రంపచోడవరం డివిజన్‌లోని సీఐ పోస్టులకు పోటీయే లేదు. కాగా, ఎన్నికల ముందు కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లిన రవికాంత్, వైఆర్‌కే శ్రీనివాస్, దేవకుమార్ వంటి సీఐలు జిల్లాకు తిరిగొచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
డీఎస్పీ పోస్టులకూ పైరవీలే..
సీఐ పోస్టింగ్‌లతో పాటు డీఎస్పీల పోస్టింగ్‌ల కోసమూ పైరవీలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డీఎస్సీ వీరారెడ్డి మినహా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డీఎస్పీలకు బదిలీలు తప్పవు. కాకినాడ కోసం అరిటాకుల శ్రీనివాస్, పెద్దాపురం కోసం రత్నకుమార్ గట్టిప్రయత్నాల్లో ఉన్నారు. రామచంద్రపురం డీఎస్పీ వచ్చి ఏడాదిన్నర పూర్తికాకుండానే రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులతో వెళ్లిపోయేందుకు మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాల సమాచారం. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు.