
రూ. అరకోటి నష్టం
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు, ఈదురుగాలులు జిల్లా రైతులను నిలువునా ముంచేశాయి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయం చేయవలసిన అధికారులు నిబంధనల మీనమేషాలు లెక్కపెడుతూ.. నష్టాన్ని బాగా తగ్గించి చూపిస్తున్నారు. సుమారు రూ. 50 కోట్ల మేర అరటి, బొప్పాయి, మామిడి రైతులు నష్ట పోగా, అందులో సగం మాత్రమే నష్టపోయినట్టు అధికారులు అంచనాలు తయారు చేశారు. జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి దీనంగా మారింది. ఓవైపు ప్రకృతి విపత్తులు, చీడపీడల నుంచి పంటలను నష్టపోతున్న రైతులకు మరోవైపు అధికారుల అలసత్వం వల్ల అపార నష్టం ఏర్పడుతోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలో 120 హెక్టార్లలో అరటి, 45 హెక్టార్లలో బొప్పాయి పంటకు నష్ట వాటిల్లినట్టు సమాచారం.
ఈ లెక్కన హెక్టారుకు రూ. 29వేలు చొప్పున అనధికారి కంగా రూ. 47 లక్షల 85 వేల మేరనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే కేవలం రూ 28 లక్షల 41 వేల 600 మేర నష్టం వాటిల్లిన ట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. అలాగే సుమారు 300 హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలగా..ఎక్కడా నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పడం విశేషం. నిబం ధనల ప్రకారం మామిడి చెట్లు వేళ్లతో సహా బయటకు వస్తేనే నష్టంగా పరిగణిస్తామని చెబుతు న్నారు. నష్టం అంచనాల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో జిల్లాలో ఉద్యాన పంట లు సాగుచేస్తున్న రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో వరి తరువాత పెద్ద మొ త్తంలో సాగు చేసిది ఉద్యాన పంటలనే. అరటి, బొప్పాయి, మామిడి పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. మూడు నాలుగు రోజులుగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురుగాలులు, కురిసిన వర్షానికి ఈ మూడు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జిల్లాలో 88.4 హెక్టార్లలో అరటి పంట నష్టపోగా, 30 హెక్టార్లలో బొప్పాయి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకన్నా పెద్ద మొత్తంలోనే నష్టం వాటిల్లింది. కాని నిబంధనల సాకు చూపి 50 శాతానికి పైగా పంట నష్టం జరిగి తేనే నష్ట పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆ మేరకు నివేదికలు రూపొందించారు. గాలులతో భారీ ఎత్తున మామి డి పంటకు నష్టం వాటిల్లినా నష్ట పరిహారం వర్తింపజేయడంలేదు. మామిడి సంబంధించి తోటలో చెట్లు వేళ్లతో సహా కూలిపోతేనే నష్టంగా గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయంలో తాము చేసేదేమి ఉండదని అధికారులు చెబు తున్నారు.అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 200 హెక్టార్లపైనే మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ లెక్కన ప్రభు త్వం తరఫున అందించే నష్టపరిహారంతో లెక్క వేస్తే సుమారు రూ 18 లక్షల వరకు నష్టం వాటిల్లింది.