ఆదుకునేందుకు వాన వచ్చింది! | India vs Australia 3rd Test Rain Disrupts Play at Brisbane | Sakshi
Sakshi News home page

ఆదుకునేందుకు వాన వచ్చింది!

Published Tue, Dec 17 2024 4:46 AM | Last Updated on Tue, Dec 17 2024 4:46 AM

India vs Australia 3rd Test Rain Disrupts Play at Brisbane

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 51/4 

మరో 394 పరుగులు వెనుకంజ

మూడో రోజూ టెస్టుకు వర్షం దెబ్బ 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 ఆలౌట్‌  

కంగారూ గడ్డపై భారత పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన మూడో టెస్టులోనూ కొనసాగింది. బౌలింగ్‌ వైఫల్యంతో ఆతిథ్య జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం కలి్పంచిన టీమిండియా తమ బ్యాటింగ్‌ వంతు వచ్చేసరికి చేతులెత్తేసింది. పది ఓవర్లలోపే పేలవ షాట్లతో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి వెనుదిరగ్గా... కొద్ది సేపటికి రిషభ్‌ పంత్‌ వీరిని అనుసరించాడు. 

ఆసీస్‌ బౌలర్లు చెలరేగుతున్న తీరు చూస్తే మూడో రోజే మన ఆట ముగిసిపోతుందేమో అనిపించింది. అయితే ఉదయం నుంచి పదే పదే అంతరాయం కలిగించిన వర్షం చివర్లో మళ్లీ వచ్చి ఊరట అందించింది. నాలుగో రోజు మన బ్యాటర్లు ఆదుకొని జట్టును కాస్త మెరుగైన స్థితికి చేరుస్తారా... లేక ఆసీస్‌కు విజయావకాశం సృష్టిస్తారా చూడాలి.  

బ్రిస్బేన్‌: భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో టెస్టుకు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. మ్యాచ్‌ మూడో రోజు సోమవారం కేవలం 33.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 394 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్‌ నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 405/7తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (88 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, జస్‌ప్రీత్‌ బుమ్రా (6/76) ఆరు వికెట్లతో ముగించాడు.  

మరో 40 పరుగులు... 
మూడో రోజు ఆసీస్‌ ఆటను కేరీ నడిపించాడు. జడేజా బౌలింగ్‌లో ఫోర్‌తో 53 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మిచెల్‌ స్టార్క్‌ (30 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) కొద్దిసేపు అండగా నిలిచాడు. స్టార్క్‌ను వెనక్కి పంపించి బుమ్రా తన ఆరో వికెట్‌ను సొంతం చేసుకున్నాడు. 11 ఓవర్ల  తర్వాత వాన రావడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. మళ్లీ మొదలయ్యాక మరో 5.1 ఓవర్లలో ఆసీస్‌ చివరి 2 వికెట్లు కోల్పోయింది. లయన్‌ (2)ను సిరాజ్‌ బౌల్డ్‌ చేసిన మరో 4 బంతులకు కేరీ వికెట్‌ ఆకాశ్‌దీప్‌ ఖాతాలో చేరింది. సోమవారం మొత్తం 16.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 40 పరుగులు జత చేసింది.  

టపటపా... 
ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టిన యశస్వి జైస్వాల్‌ (4)ను స్టార్క్‌ రెండో బంతికే పెవిలియన్‌ చేర్చగా,  అతని తర్వాతి ఓవర్‌ తొలి బంతికే గిల్‌ (3 బంతుల్లో 1) కూడా అవుటయ్యాడు. గల్లీలో మిచెల్‌ మార్‌‡్ష అద్భుత రీతిలో గాల్లోకి ఎగిరి క్యాచ్‌ను అందుకోవడం విశేషం. విరాట్‌ కోహ్లి (16 బంతుల్లో 3) ఆఫ్‌స్టంప్‌ బలహీనతను మరోసారి సొమ్ము చేసుకుంటూ హాజల్‌వుడ్‌ చక్కటి బంతితో వెనక్కి పంపించాడు. కోహ్లి వికెట్‌ పడగానే వర్షం రావడంతో ఆట కాస్త ఆగింది. ఆట మళ్లీ మొదలయ్యాక రిషభ్‌ పంత్‌ (12 బంతుల్లో 9)ను అవుట్‌ చేసి కమిన్స్‌ మరో దెబ్బ కొట్టాడు. అనంతరం మరో 19 బంతులకే వాన రాకతో ఆట పూర్తిగా రద్దయింది. ఒకవైపు నాలుగు వికెట్లు పడినా... మరో ఎండ్‌లో రాహుల్‌ కొన్ని చక్కటి షాట్లతో పట్టుదలగా నిలబడ్డాడు.  

స్కోరు వివరాలు 
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: ఖ్వాజా (సి) పంత్‌ (బి) బుమ్రా 21; మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్‌ (సి) కోహ్లి (బి) నితీశ్‌ రెడ్డి 12; స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 101; హెడ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 152; మార్‌‡్ష (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 70; కమిన్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 20; స్టార్క్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 18; లయన్‌ (బి) సిరాజ్‌ 2; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 35; మొత్తం (117.1 ఓవర్లలో ఆలౌట్‌) 445. 
వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385, 8–423, 9–445, 10–445. 
బౌలింగ్‌: బుమ్రా 28–9–76–6, సిరాజ్‌ 23.2–5–97–2, ఆకాశ్‌దీప్‌ 29.5–5–95–1, నితీశ్‌ రెడ్డి 13–1–65–1, జడేజా 23–2–95–0.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) మార్‌‡్ష (బి) స్టార్క్‌ 4; కేఎల్‌ రాహుల్‌ (బ్యాటింగ్‌) 33; గిల్‌ (సి) మార్‌‡్ష (బి) స్టార్క్‌ 1; కోహ్లి (సి) కేరీ (బి) హాజల్‌వుడ్‌ 3; పంత్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 9; రోహిత్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (17 ఓవర్లలో 4 వికెట్లకు) 51. 
వికెట్ల పతనం: 1–4, 2–6, 3–22, 4–44. 
బౌలింగ్‌: స్టార్క్‌ 8–1–25–2, హాజల్‌వుడ్‌ 5–2–17–1, కమిన్స్‌ 2–0–7–1, లయన్‌ 1–0–1–0, హెడ్‌ 1–0–1–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement