కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7 తేదీల్లో చేపట్టనున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా ప్రజలు సహకరించాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7వ తేదీలోపు విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశం అవుతున్న దృష్ట్యా రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు.
జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోని అన్ని రహ దారులను దిగ్బంధించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి,కడప సమన్వయకర్త అంజ ద్‌బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాసీమబాబు, అఫ్జల్‌ఖాన్, ఎంపీ సురేష్, పులి సునీల్, ఖాద్రి పాల్గొన్నారు.
ఇంటికొకరు ఉద్యమంలో పాల్గొనాలి:
ఎమ్మెల్యే ఆకేపాటి
మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఇంటికి ఒకరు చొప్పున సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్‌ఆర్‌సీపీ మాత్రమే పోరాటం చేస్తోందని చెప్పారు.
పనులు వాయిదా వేసుకోవాలి: కొరముట్ల
రాష్ట్ర విభజన పై చర్చించడానికి మంత్రుల బృందం మళ్లీ సమావేశం అవుతుండడాన్ని నిరసిస్తూ రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నామని, ప్రజలు 6, 7 తేదీలలో ఏవైనా కార్యక్రమాలుంటే వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.