మంత్రి పదవి కోసం ఒకే జిల్లా నుంచి ఆరుగురు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి పదవుల పంపిణీ తలనొప్పిగా మారింది. కొన్ని జిల్లాల్లో చాలామంది నాయకులు పోటీపడటంతో ఇబ్బందికరంగా మారింది. అనంతపురం జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తూ పైరవీలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియార్టీ ప్రాతిపదికను బట్టి తమకు బెర్తు దక్కుతుందని ఎవరికివారే ఆశల పల్లకీల్లో విహరిస్తున్నారు. దీంతో కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో బాబు మల్లగుల్లాలుపడుతున్నట్టు సమాచారం.
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే హిందూపురం నుంచి గెలిచిన చంద్రబాబు వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ తనకు కేబినెట్ బెర్తు కావాలని పట్టుబడితే ఆయనకు ఇవ్వడం గ్యారెంటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన సునీతకు చాన్స్ లేనట్టే. ఇక ఉరవకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కరికే చాన్స్ దక్కే అవకాశముంది.
ఇక బీసీ కోటాలో తమకు ఇవ్వాలంటూ కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి కోరుతున్నారు. ఇద్దరూ సీనియర్ నాయకులే కావడంతో బాబు ఎవరివైపు మొగ్గు చూపుతారో? ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. బాబును కలసి తన మనసులో మాట చెప్పారు. ఒకే జిల్లా నుంచి ఆరుగురు మంత్రి పదవి రేసులో ఉండటంతో అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి?