సీఎం చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న మంజుల, శంకరమ్మ
పెనుకొండ: సీఎం చంద్రబాబు ఎదుట తురకలాపట్నం వాసులు సమస్యలు ఏకరువు పెట్టారు. సోమవారం రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలోని రచ్చకట్టపై ముఖ్యమంత్రి గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా... వేదిక వద్దకు వెళ్లిన మంజుల తమ గ్రామంలోని శ్మశానానికి దారి చూపాలని వేడుకుంది. తమ గ్రామంలోని శ్మశానానికి దారిలేక చాలా ఇబ్బందులు పడుతున్నామనీ, పొలాల మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు భూ యజమానులు ఒప్పుకోవడం లేదని వెల్లడించింది. తమ ఇబ్బందులను అధికారులకు, ప్రజాప్రతినిథులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
అక్కడే ఉన్న గ్రామ కార్యదర్శి కూడా శ్మశానానికి దారి లేక జనం పడుతున్న ఇబ్బందులను వివరించారు. స్పందించిన సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ వీరపాండియన్‌ను ఆదేశించారు. అనంతరం మంజుల మాట్లాడుతూ, తమ గ్రామంలో బస్టాండ్ లేక జనం పడుతున్న బాధలను సీఎం దృష్టికి తీసుకువచ్చింది. వెంటనే బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చేనేత వర్గానికి చెందిన శంకరమ్మ అనే ఉపాధి హామీ కూలీ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పిస్తున్నారనీ, అయితే 150 రోజుల పని కల్పించడం లేదన్నారు. దీంతో ఈ సమస్య కేంద్రం పరిధిలో ఉందని వారిని అక్కడి నుంచి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment