మియాపూర్, న్యూస్‌లైన్: వాహనదారుడిని లిఫ్ట్ అడిగి.. కారుతో పాటు ఉడాయించిన ఓ మాయ‘లేడీ’కి కూకట్‌పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి.సత్యనారాయణ ఆరు నెలలు జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్‌లో కారులో వెళ్తున్న జి.వెంకట్‌రెడ్డిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది. కాగా, వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి.
నకిలీ పోలీసులకు 10 నెలల జైలు...
పోలీసులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు.. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన ప్రదీప్‌సింగ్, వెంకట్‌రాజ్ పోలీసులమని చెప్పుకుంటూ తిరుగుతూ వాహనాలను అపహరిస్తున్నారు. వీరిద్దరినీ కూకట్‌పల్లి పోలీసులు గత జనవరిలో అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సత్యనారాయణ.. నిందితులకు 10 నెలల జైలుశిక్ష, రూ.50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
మాయ’లేడీ’కి ఆరు నెలల జైలు శిక్ష
Published Thu, Nov 28 2013 12:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement