lady theif
-
కి‘లేడీ’: కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసుతో...
గుంటూరు రూరల్: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎల్‌ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది. ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్‌చేసి బయటకు పరిగెత్తింది. (చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..) ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు సౌత్‌జోన్ రూరల్ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్.ఆరోగ్యరాజును, ఎస్ఐ ఎస్.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్ జాన్‌సైదా, షేక్ మస్తాన్‌వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. (చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం) -
కిలాడీ లేడి అరెస్ట్
అన్నానగర్: తిరుప్పూర్‌లో బాడుగకు ఇల్లు అడిగినట్లు నటించి నగలు, నగదు చోరీలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 50 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. తిరుప్పూర్ కుమరానందపురం ప్రాంతంలో ఇళ్లు, దుకాణాల్లో వరుసగా నగలు, నగదు చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు తిరుప్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేయగా వీటన్నింటికీ ఓ మహిళ కారణమని గుర్తించారు. తిరుప్పూర్ కొత్త బస్టాండ్‌లో యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విచారనలో నిందితురాలు శివగంగై జిల్లా వెట్రియూర్ ఉసిలంగులానికి చెందిన శరణ్య (27)అని, ప్రస్తుతం ఈరోడ్ జిల్లాలో ఉంటున్నట్లు తెలిసింది. తిరుప్పూర్‌కు వచ్చి కుమరానందపురంలో ఇల్లు బాడుగకు తీసుకొని, ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా 40 సవర్ల నగలు చోరి చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా అనుప్పర్పాలైయమ్ ప్రాంతంలో ఉన్న 10 సవర్ల నగలు చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీలో లేడీ దొంగల ముఠా
జయనగర: టిప్‌టాప్‌గా దుస్తులు ధిరించిన ఒక యువతి తన అనుచరులతో కలిసి నగరంలో ఇళ్లను లూటీ చేస్తోంది. సీసీ కెమెరాలో దొరికిన చిత్రాల ఆధారంగా పోలీసులు కిలేడీ కోసం వెతుకున్నారు. వివరాలు... జయనగర 5 వ బ్లాక్ 9 వ మెయిన్‌రోడ్డులోని రాజారామ్ సిల్క్ యజమాని మురళీకృష్ణ కుటుంబం నివాసముంటుంది. ఈ నెల 22 తేదీ ఉదయం 11.30 సమయంలో ఇంటికి తాళం వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తిరిగిరాగా, ఇంటి డోర్‌లాక్ బద్దలు కొట్టడానికి యత్నించినట్లు కనబడింది. తక్షణం ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరా పరిశీలించగా దొంగలు చోరీకి యత్నించిన దృశ్యాలు కనిపించాయి. యువతి రెక్కీ.. మధ్యాహ్నం 2.30 సమయంలో జీన్స్‌ప్యాంట్, టీషర్ట్ ధరించి తలకు చున్నీ కట్టుకుని వచ్చిన యువతి ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. అనంతరం కిటికీలో నుంచి గమనించి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అని గమనించింది. అనంతరం చుట్టుపక్కన రాతి బెంచీ పై కూర్చుని ఎవరైనా వస్తున్నారా అని వేచిచూసిన అనంతరం మొబైల్లో తన అనుచరులకు సమాచారం అందించింది. కొంతసేపటికి బ్యాక్‌ప్యాక్ వేసుకుని టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి, మరొకరు ఇంటి కాంపౌండ్‌లోకి ప్రవేశించారు. బ్యాగ్ నుంచి సుత్తి, ఇనుప కడ్డీ తీసి ఇంటి తాళం పగులగొట్టడానికి యత్నించారు. ఈ సమయంలో సీసీ కెమెరాను గమనించిన దుండగులు మరో పక్కకు తిరిగారు. చివరికి చోరీ చేయకుండా ముఠా వెనుదిరిగింది. ఎన్నెన్ని చోరీలు చేసిందో గేట్ వద్ద అమర్చిన సీసీ కెమెరా పరిశీలించగా దొంగలు కారులో వచ్చి ఇంటి గేట్ ముందు కారు నిలిపిన దృశ్యాలు ఉన్నాయి. ఇంటి యజమాని మురళీకృష్ణ జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని లేడీగ్యాంగ్ కోసం అన్వేషిస్తున్నారు. సీసీ కెమెరాలో మహిళ ముఖం స్పష్టంగా నిక్షిప్తమైంది. ఈ ముఠా నగరంలో ఎన్ని చోరీలు చేసిందా? అని ఖాకీలు కూపీ లాగుతున్నారు. -
పట్టపగలే చోరీకి యత్నం
కామారెడ్డి క్రైం : కామారెడ్డిలో లేడీ దొంగల ముఠా సంచరిస్తోంది. దొంగలంటే సహజంగా గుర్తుకువచ్చేది పురుషులే. కానీ గురువారం పట్టణంలోని ఓ ఇంట్లో చొరబడిన దొంగల తాలూకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే వారు మహిళలని తేలింది. గురువారం మధ్యాహ్నం ముగ్గురు సభ్యులున్న లేడీ దొంగల ముఠా జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో సాందీపని డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వీధిలో ఆర్టీసీ కండక్టర్ జానకి రాములు నివాసం ఉంటున్నాడు. గురువారం ఆయన విధులకు వెళ్లగా, అతని భార్య సుధారాణి ఇంటికి సెంట్రల్‌లాక్ చేసుకుని మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో తాళం వేసి ఉండడాన్ని గమనించిన లేడి దొంగల ముఠా కొద్దిసేపటికే ఇంట్లోకి చొరబడ్డారు. ఇళ్లంతా చిందరవందరగా చేశారు. బంగారం, నగదు లభించకపోవడంతో అక్కడి నుంచి వట్టి చేతులతోనే వెళ్లిపోయారు. ఎలాంటి ఆస్తినష్టం జరుగలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన సుధారాణి తలుపులు తెరిచి ఉండడం, ఇళ్లంతా చిందరవందరగా ఉండడాన్ని గమనించి భర్తకు సమాచారం అందించింది. దీంతో జానకి రాములు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 14 నిమిషాల పాటు.. సదరు కాలనీవాసులందరు కలిసి ఇదివరకే వీధి చివరన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. జానకి రాములు ఇంట్లో దొంగలు పడ్డారని సీసీ కెమెరా ఫుటేజీలను శుక్రవారం పరిశీలించారు. దొంగతనానికి పాల్పడింది ముగ్గురు మహిళల దొంగల ముఠాగా గుర్తించారు. ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాక్ వేయగా ఇంటికి ఉన్న మరో మార్గం గుండా ఉన్న తలుపు గొళ్లెంలను పగులగొట్టి లోనికి చొరబడ్డారు. సరిగ్గా 12.35 గంటలకు ఇంటి యాజమాని సుధారాణి బయటకు వెళ్లింది. 12.45 నిమిషాలకు ముగ్గురు మహిళ దొంగల ముఠా నుంచి ఇద్దరు ఇంట్లోకి చొరబడ్డారు. మరొకరు కొద్ది దూరంలో కూర్చుని గమనిస్తున్నారు. 12.59 గంటలకు ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బయటకు వచ్చారు. సరిగ్గా 14 నిమిషాల పాటు ఇద్దరు మహిళా దొంగలు ఇంట్లో విలువైన వస్తువుల కోసం గాలించారు. నగదు, బంగారం కోసం మాత్రమే వారు ఇళ్లంతా గాలించినట్లు తెలుస్తోంది. ఇంట్లోని అల్మారాలో వెండి వస్తువులు ఉన్నప్పటికి పక్కన పడేశారు. కామారెడ్డిలో కలకలం.. కామారెడ్డిలో లేడీ దొంగల ముఠా సంచరిస్తుండడం కలకలం రేపుతోంది. వారంతా పంజాబీ డ్రెస్సులు వేసుకుని కాలనీలో తిరుగుతున్నారు. వారిలోని ఓ మహిళ వద్ద ఏడాది వయసున్న చిన్నారి ఉంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారిని ఎత్తుకుని కాలనీల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సంచరిస్తున్న ముఠాలో ముగ్గురు మహిళలే ఉన్నారా, లేక వారి వెనుక ఇంకా ఎవరైనా పురుషులు కూడా ఉన్నారా అనే సందేహాలు ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి నిత్యం ఎంతోమంది వలస కార్మికులు, చిరు వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం వస్తుంటారు. కొత్త వ్యక్తులపై నిఘా కొరవడుతోంది. అందులోనూ దొంగల ముఠాలు సంచరిస్తుండడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. వేసవికాలం కావడంతో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ ప్రతి వేసవిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు మన ప్రాంతంలో సంచరించడం తెలిసిందే. పోలీస్‌శాఖ తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రంగమ్మ.. దొంగమ్మ..
అమలాపురం టౌన్ : బస్సులు, ఆటోల్లో ప్రయాణించే మహిళల బ్యాగ్‌ల్లో నగలు, నగదు చాకచక్యంగా నొక్కేసే నైపుణ్యం ఆమెది. బస్సులు, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించే మహిళలను టార్గెట్ చేస్తుంది. బస్సు స్టాపుల్లో, ముఖ్య కూడళ్లలో ఓ సాధారణ ప్రయాణికురాలిగా నిలబడి మహిళా ప్రయాణికుల కదలికలను కనిపెడుతూ వారి బ్యాగ్‌లను, వారి కూడా మగవారు ఉన్నారా? లేదా?.. ఇలాంటి పరిస్థితులున్న మహిళా ప్రయాణికులను ఎంచుకుని వారితో బస్సులో.. ఆటోలో ప్రయాణించి అదును చూసి బ్యాగ్‌లను బ్లేడ్‌తో కట్ చేసి కాజేస్తుంది. ఈ మాయలేడీని అమలాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఆమె వివరాలను పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గోకవరం మండల శివారు సంజయ్ కాలనీకి చెందిన హంసపరుగుల రంగమ్మ అనే రంగను పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమె వద్ద రూ.రెండు లక్షల విలువైన 72 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు రంగమ్మ జిల్లాలో పలుచోట్ల ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితురాలు రంగమ్మను, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. గత సంవత్సరం ఆగస్టు 17న మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన గెద్డాడ లక్ష్మీ భవాని బస్సులో అమలాపురం ప్రయాణిస్తున్న సమయంలో ఆమె బ్యాగ్‌లో నగలతో దాచుకున్న చిన్న సంచిని చాకచక్యంగా కాజేసి తర్వాత స్టేజ్‌లో దిగిపోయింది. అయితే అప్పట్లో బాధిత మహిళ తన పక్కనే కూర్చున్న ప్రయాణికురాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కొన్ని ఆనవాళ్లతో ఫిర్యాదు చేసింది. పక్కన కూర్చున్న అనుమానిత మహిళ పొట్టిగా, లావుగా ఉంటుందని, నడుముపై పెద్ద పుట్టి మచ్చ ఉంటుందని పోలీసులకు ఆమె గుర్తులు చెప్పింది. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో అప్పటి నుంచి నిఘా పెట్టడంతో పట్టణ ఎస్సై విజయశంకర్ అమలాపురంలో సంచరిస్తున్న ఆమెను గుర్తించి పట్టుకున్నారు. ఆమెను విచారించగా నేరాన్ని అంగీకరించడంతో ఆమె నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావుతో పాటు పట్టణ ఎస్సైలు విజయశంకర్, సురేంద్ర, క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావులు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమకు ఉన్న నగలను ధరించాలే తప్ప.. వాటిని చిన్న బ్యాగ్‌లు, పర్సులు, సంచల్లో దాచి వాటిని బట్టల బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లకూడదని సూచించారు. ఇలా బ్యాగ్‌లో నగలు, నగదు పెట్టుకుంటే ఇలాంటి చోరీలను చవి చూడాల్సి వస్తుందని వివరించారు. -
పోలీసులకు చిక్కిన మాయ లేడి
ద్వారకాతిరుమల : భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్షేత్ర పరిసరాల్లోనూ, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులను ఎంతో చాకచక్యంగా తెరచి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మాయలేడిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన 19 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో డీఎస్పీ గురువారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన జలతా లక్ష్మి ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తుల బంగారు వస్తువులను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చేబ్రోలు మండలం కైకరం గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తూ ఆమె పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో మూడు, చేబ్రోలు పోలీస్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. లక్ష్మిని పాత నేరస్తురాలిగా గుర్తించామని పేర్కొన్నారు. ఆమెను గురువారం ఉదయం స్థానిక కుంకుళ్లమ్మను ఆలయం వద్ద భీమడోలు సీఐ బిఎన్.నాయక్ అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఈ కేసులను ఛేదించిన సీఐ నాయక్‌ను, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దర్యాప్తుకు సహకరించిన ఐడీ పార్టీ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ వసంతరావు, నాగేశ్వరరావు, రామచంద్రరావు, మురళీ తదితరులను ఆయన అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్సీ ఈశ్వరరావు అన్నారు. ఆలయ పరిసరాల్లో మరికొన్ని సీసీ కెమేరాల ఏర్పాటుకు ఆలయ అధికారులతో చర్చించామన్నారు. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే దొంగతనాల నియంత్రణకు సంబంధించి భక్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని వివరించారు. -
నమ్మకంగా వచ్చి..బంధువు ఇంట్లోనే చోరీ
ఒంగోలు క్రైం: దూరపు బంధువని ఇంటికి రానిస్తే..ఆ ఇంటికే కన్నం వేసిన సంఘటన ఒంగోలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎన్.సురేష్‌కుమార్‌రెడ్డి మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందిన షేక్ గాలీబ్‌బీ ఈ నెల 4వ తేదీన ఒంగోలు నగరంలోని మరాఠిపాలెంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. బంధువులైన పఠాన్ మస్తాన్ దూరపు బంధువని ఇంట్లో ఉంచి మర్యాదలు చేశారు. అయితే తన దొంగ బుద్ధి పోనిచ్చుకోని గాలీబ్‌బీ బెడ్రూమ్లో ఉన్న బీరువా తాళాలు అపహరించి బీరువా లాకర్లోని సుమారు 14 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించింది. ఆమె ఇంటి నుంచి వెళ్లిన తరువాత చూసుకుంటే బీరువాలోని ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పఠాన్ మస్తాన్ ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై బి.శ్రీకాంత్ సిబ్బందితో దర్యాప్తు చేశారు. దీంతో గాలీబ్‌బీపై అనుమానంతో మంగళవారం ఉదయం అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆమెను గుర్తించి పట్టుకుని విచారించడంతో బంగారు ఆభరణాల గుట్టు వెల్లడించిందన్నారు. దీంతో ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా మహిళా దొంగను పట్టుకున్నందుకు సిబ్బందిని ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. -
మత్తు మందు ఇచ్చి నగల అపహరణ
వేనాడు(తడ): రైలులో ప్రయాణిస్తున్న మహిళలను మాయ మాటల్లో దించి, వారితో కలసి ప్రయాణించి అదనుచూసి చాకచక్యంగా నగలను దోచుకెళ్లిన ఘటన గురువారం రాత్రి వేనాడులో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు తడ మండలం ఇరకం గ్రామానికి చెందిన నైనా విజయమ్మ, నైనా ధనలక్ష్మి, నైనా సెల్వి కుటుంబాలు చాలా కాలం క్రితం తమిళనాడులోని పొన్నేరికి కాపురం వెళ్లిపోయారు. అమావాస్య సందర్భంగా వేనాడులో ఉన్న షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను దర్శించుకుని రాత్రికి అక్కడ నిద్ర చేసేందుకు ముగ్గురూ గురువారం వేనాడు గ్రామానికి రైలులో వచ్చారు. వీరికి పొన్నేరి వద్ద బురకా వేసుకున్న మహిళ రైలులో కలిసి మాటలు కలిపింది. ఆమె మాటలకు వీరు ముగ్గురూ బాగా ఆకర్షితులయ్యారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో దర్గా వద్ద అన్నదానం చేసి ముగ్గురు మహిళలకు చీరలు అందించాలని వెళుతున్నట్టు ఆమె వీరికి తెలిపారు. ఇంతలో సూళ్లూరుపేటకు చేరుకున్న మహిళలను మీరు నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారంటూ మీకు చీరలు తీసిచ్చి మరో ఇద్దరు ఇతరులను చూసి మిగిలిన చీరలు ఇస్తానంటూ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి చీరలు కొనిచ్చింది. అనంతరం అందరూ వేనాడుకి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు తమతోపాటు తెచ్చుకున్న భోజనం తమకు పరిచయమైయ మహిళతో కలిసి తిన్నారు. అనంతరం ఆ మహిళ కూల్‌డ్రింక్ తెచ్చి వీరికి అందించింది. కూల్‌డ్రింక్ తాగిన కొంతసేపటికి వారు ముగ్గురూ నిద్రలోకి జారుకోగా విజయమ్మ మెడలోని తాళిబొట్టు, కాసులతోటు మరో బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. మిగిలిన ఇద్దరు మహిళలు తమ వస్తువులను దాచుకోవడంతో అవి భద్రంగా మిగిలాయి. ఉదయం లేచి చూసిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తడ ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని మత్తు ప్రభావం తొలగని మహిళలను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాయ’లేడీ’కి ఆరు నెలల జైలు శిక్ష
మియాపూర్, న్యూస్‌లైన్: వాహనదారుడిని లిఫ్ట్ అడిగి.. కారుతో పాటు ఉడాయించిన ఓ మాయ‘లేడీ’కి కూకట్పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి.సత్యనారాయణ ఆరు నెలలు జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్‌లో కారులో వెళ్తున్న జి.వెంకట్‌రెడ్డిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది. కాగా, వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి. నకిలీ పోలీసులకు 10 నెలల జైలు... పోలీసులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు.. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన ప్రదీప్‌సింగ్, వెంకట్రాజ్ పోలీసులమని చెప్పుకుంటూ తిరుగుతూ వాహనాలను అపహరిస్తున్నారు. వీరిద్దరినీ కూకట్పల్లి పోలీసులు గత జనవరిలో అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సత్యనారాయణ.. నిందితులకు 10 నెలల జైలుశిక్ష, రూ.50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.