మచిలీపట్నం : మండలంలోని తాళ్లపాలెం పంచాయతి, మంగినపూడి బీచ్ పక్కనే ఉన్న వైఎస్సార్ ఫిషర్‌మెన్ కాలనీలో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో 120కి పైగా కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. రూ.2కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ఈ కాలనీలో 200కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా కాకినాడ సమీపంలోని ఉప్పాడకు చెందిన వారు. సముద్రంలో చేపలవేటే వీరికి జీవనాధారం. శనివారం మధ్యాహ్నం వరకు చేపలవేట కొనసాగించిన మత్స్యకారులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి బీచ్ వద్ద వలలు సరిచేసుకుంటున్నారు. ఇంతలో కాలనీలో చర్చి పక్కనే ఉన్న చోరుపల్లి కొర్లమ్మ ఇంటివద్ద మంటలు రేగాయి.
ఎవరికి వారు మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఒక్కసారిగా మంటలు నలువైపులా వ్యాపించటంతో ఇళ్లలో ఉన్న మహిళలు, అక్కడే ఆడుకుంటున్న చిన్నారులను తీసుకుని దూరంగా వెళ్లిపోయారు. ఈక్రమంలో కొందరికి స్వల్పగాయాలయ్యాయి. బీచ్ సమీపంలో పనుల్లో నిమగ్నమైన మత్స్యకారులు ఇళ్లకు వచ్చి చూసుకునే సరికే మంటలు దట్టంగా అలుముకున్నాయి. వారి కళ్లెదుటే ఇళ్లన్నీ బూడిదగా మారాయి. ఇళ్లలో ఉన్న పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలటంతో ప్రాణభయంతో స్థానికులు పరుగులు పెట్టారు. అగ్ని కీలలకు గ్యాస్ తోడు కావటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. తమ సంపాదనంతా కళ్లెదుటే కాలి బూడిద కావటంతో మత్స్యకారులు భోరున విలపిస్తున్నారు. ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ నారదముని, ఎంపీడీవో సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కూడా బాధితులను పరామర్శించారు.
60 ఇళ్లు దగ్ధం
Published Sun, Jan 11 2015 1:24 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement