manginapudi Beach
-
ఏపీలో కనువిందు చేసే ఆకర్షణీయమైన బీచ్‌లు (ఫొటోలు)
-
మంగినపూడి బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం
కోనేరు సెంటర్: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు. బందరు రూరల్ పోలీసులు బుధవారం రిసార్ట్‌పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కాయి. రిసార్ట్ నడిపే వ్యక్తి మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంటకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తూ ఈ విధమైన నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో... రిసార్ట్‌లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్రూమ్లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘పాతపాయలో పూడిక తీయించండి’
సాక్షి, మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం పరిశీలించారు. బీచ్‌కు ఆనుకుని గతంలో ఉన్న సముద్రపు పాయ పూర్తిగా పూడిపోయింది. దీనికి కొంత దూరంలో మరోపాయ ఏర్పడటాన్ని మంత్రి గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్య్సకారులు వేటకు వెళ్లే బోట్లు ఈ పాయ నుంచే వెళ్లాల్సి ఉందన్నారు. పాతపాయ పూడిపోయి నూతన పాయ ఏర్పడంతో బోట్లు వేటకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. మత్య్సకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీచ్ పర్యాటక ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా పాత పాయలోనే పూడిక తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏర్పడిన పాయకు అడ్డంగా ఇసుక బస్తాలను ఉంచి పాత పాయను తవ్వాలని సూచించారు. ఈ పర్యటనలో పేర్ని నాని వెంట వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు లంకే వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్లు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, మెప్మా పీడీ జి.వి.సూర్యనారాయణ, తహాసీల్దార్ డి.సునీల్‌బాబు, ఎంఆర్ఐ యాకూబ్ ఉన్నారు. -
అసౌకర్యాల బీచ్
మంగినపూడిబీచ్ అందవిహీనంగా మారింది. కోట్ల రూపాయల్లో బీచ్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ ఇంత వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. గతంలో ఏర్పాటు చేసిన స్నానాల గదులు, మహిళలు దుస్తులు మార్చుకునే రూమ్‌లు, వస్తువులు భద్రపరుచుకునే స్ట్రాంగ్‌రూమ్‌లు, నిరుపయోగంగా ఉన్నాయి. స్నానాల గదులకు, రూమ్‌లకు తలుపులు లేక సందర్శకులు దుస్తులు ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే మంగినపూడిబీచ్ సౌకర్యాల లేమితో అందవిహీనంగా మారింది. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా సందర్శకులు తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. సౌకర్యాలతోపాటు తాగునీటి సౌకర్యం లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. బీచ్ అభివృద్ధిని చేయటం పక్కన పెట్టి ఉన్న సౌకర్యాలను మెరుగుపరచాలని సందర్శకులు వాపోతున్నారు. – ఫోటోలు : అజీజ్, మచిలీపట్నం -
పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
మంత్రి పల్లెరఘునాథరెడ్డి మచిలీపట్నం(కోనేరుసెంటర్) : మంగినపూడి బీచ్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బందరు మండలంలోని మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బందరుకు విశిష్టస్థానం ఉందన్నారు. బందరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పోర్టును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. పోర్టు అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, భూముల విలువ పెరిగిపోతుందని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంగినపూడి బీచ్‌ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత మంత్రి రఘునాథరెడ్డి చిలకలపూడిలోని శ్రీపాండురంగ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్ ఎంపీపీ ఊసా వెంకట సుబ్బారావు, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి బీచ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గుడివాడ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు బీచ్‌కు వెళ్లగా.. అందరూ సాగర జలాల్లోకి దిగారు. వీరిలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురిని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. వారు అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. -
60 ఇళ్లు దగ్ధం
మచిలీపట్నం : మండలంలోని తాళ్లపాలెం పంచాయతి, మంగినపూడి బీచ్ పక్కనే ఉన్న వైఎస్సార్ ఫిషర్మెన్ కాలనీలో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో 120కి పైగా కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. రూ.2కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ఈ కాలనీలో 200కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా కాకినాడ సమీపంలోని ఉప్పాడకు చెందిన వారు. సముద్రంలో చేపలవేటే వీరికి జీవనాధారం. శనివారం మధ్యాహ్నం వరకు చేపలవేట కొనసాగించిన మత్స్యకారులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి బీచ్ వద్ద వలలు సరిచేసుకుంటున్నారు. ఇంతలో కాలనీలో చర్చి పక్కనే ఉన్న చోరుపల్లి కొర్లమ్మ ఇంటివద్ద మంటలు రేగాయి. ఎవరికి వారు మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఒక్కసారిగా మంటలు నలువైపులా వ్యాపించటంతో ఇళ్లలో ఉన్న మహిళలు, అక్కడే ఆడుకుంటున్న చిన్నారులను తీసుకుని దూరంగా వెళ్లిపోయారు. ఈక్రమంలో కొందరికి స్వల్పగాయాలయ్యాయి. బీచ్ సమీపంలో పనుల్లో నిమగ్నమైన మత్స్యకారులు ఇళ్లకు వచ్చి చూసుకునే సరికే మంటలు దట్టంగా అలుముకున్నాయి. వారి కళ్లెదుటే ఇళ్లన్నీ బూడిదగా మారాయి. ఇళ్లలో ఉన్న పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలటంతో ప్రాణభయంతో స్థానికులు పరుగులు పెట్టారు. అగ్ని కీలలకు గ్యాస్ తోడు కావటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. తమ సంపాదనంతా కళ్లెదుటే కాలి బూడిద కావటంతో మత్స్యకారులు భోరున విలపిస్తున్నారు. ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ నారదముని, ఎంపీడీవో సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కూడా బాధితులను పరామర్శించారు. -
కార్తీక పౌర్ణమి పుణ్య స్నానమెలా?
* మంగినపూడిలో అరకొర ఏర్పాట్లే * భక్తులకు సౌకర్యాల లేమి * లక్షమందికి పైగా రాక మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి మంగినపూడిబీచ్‌కు గురువారం లక్ష మందికిపైగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.గతంలో పంచాయతీ, మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసేవారు. అయితే ఈసారి పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తుంది. తాళ్లపాలెం పంచాయతీ నుంచి లక్ష రూపాయలు... పర్యాటకశాఖ ద్వారా కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో మంగినపూడిబీచ్ ఉండడంతో బుధవారం ఈ పంచాయతీ నుంచి కార్తీక పౌర్ణమి ఏర్పాట్ల నిమిత్తం లక్ష రూపాయలు నగదు తీసుకున్నారని తాళ్లపాలెం పంచాయతీ సర్పంచి వాలిశెట్టి రవిశంకర్ తెలిపారు. పర్యాటక శాఖ సహాయాధికారి జి.రామలక్ష్మణ, బందరు ఆర్డీవో పి.సాయిబాబు నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం బీచ్‌ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర పుణ్యస్నానాలకు వచ్చే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు.. మంగినపూడిబీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు సత్రంపాలెం మీదుగా లైట్‌హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఖాళీప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేయాలని పర్యాటకశాఖ అధికారి తెలిపారు. స్నానాలు ముగించుకుని వెళ్లే వారు బీచ్ రోడ్డు వెంబడి వెళ్లాల్సి ఉందన్నారు. 60 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి స్నానాలకు ముందు, స్నానాల అనంతరం బీచ్‌ను శుభ్రపరుస్తామని ఆయన చెప్పారు. దత్తాశ్రమం వద్ద, బీచ్‌లో రెండు మెడికల్ క్యాంపులతో పాటు 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నామని ఆయన వివరించారు. ప్రయాణీకుల కోసం 80 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, సముద్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేందుకు పది బోట్లు, 30 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని పర్యాటకశాఖాధికారి వివరించారు. పోలీసు బందోబస్తు కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా బీచ్ ఏరియాలో 523 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం నియమించారు. వీరిలో ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్ఐలు, 500 మంది కానిస్టేబుళ్లు, ఒక స్పెషల్ పార్టీ టీమ్‌తో పాటు ఫైర్ సిబ్బంది, మెరైన్ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.