కార్తీక పౌర్ణమి పుణ్య స్నానమెలా?
* మంగినపూడిలో అరకొర ఏర్పాట్లే
* భక్తులకు సౌకర్యాల లేమి
* లక్షమందికి పైగా రాక
మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి మంగినపూడిబీచ్‌కు గురువారం లక్ష మందికిపైగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.గతంలో పంచాయతీ, మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసేవారు. అయితే ఈసారి పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
తాళ్లపాలెం పంచాయతీ నుంచి లక్ష రూపాయలు...
పర్యాటకశాఖ ద్వారా కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో మంగినపూడిబీచ్ ఉండడంతో బుధవారం ఈ పంచాయతీ నుంచి కార్తీక పౌర్ణమి ఏర్పాట్ల నిమిత్తం లక్ష రూపాయలు నగదు తీసుకున్నారని తాళ్లపాలెం పంచాయతీ సర్పంచి వాలిశెట్టి రవిశంకర్ తెలిపారు. పర్యాటక శాఖ సహాయాధికారి జి.రామలక్ష్మణ, బందరు ఆర్డీవో పి.సాయిబాబు నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం బీచ్‌ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర పుణ్యస్నానాలకు వచ్చే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ మళ్లింపు..
మంగినపూడిబీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు సత్రంపాలెం మీదుగా లైట్‌హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఖాళీప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేయాలని పర్యాటకశాఖ అధికారి తెలిపారు. స్నానాలు ముగించుకుని వెళ్లే వారు బీచ్ రోడ్డు వెంబడి వెళ్లాల్సి ఉందన్నారు. 60 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి స్నానాలకు ముందు, స్నానాల అనంతరం బీచ్‌ను శుభ్రపరుస్తామని ఆయన చెప్పారు. దత్తాశ్రమం వద్ద, బీచ్‌లో రెండు మెడికల్ క్యాంపులతో పాటు 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నామని ఆయన వివరించారు. ప్రయాణీకుల కోసం 80 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, సముద్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేందుకు పది బోట్లు, 30 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని పర్యాటకశాఖాధికారి వివరించారు.
పోలీసు బందోబస్తు
కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా బీచ్ ఏరియాలో 523 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం నియమించారు. వీరిలో ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 500 మంది కానిస్టేబుళ్లు, ఒక స్పెషల్ పార్టీ టీమ్‌తో పాటు ఫైర్ సిబ్బంది, మెరైన్ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.