దగ్ధమైన బోగిని సందర్శించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ఫైల్)
కేసముద్రం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాద దుర్ఘటన జరిగి నేటికీ పదేళ్లయింది. 2008 జులై 31న అర్ధరాత్రి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు డౌన్‌లైన్‌లో వెళ్తున్న గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కేసముద్రం – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య అగ్ని ప్రమాదానికి గురై కొద్దినిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించి ఎస్ 9, 10, 11, 12 బోగీలు అంటుకున్నాయి.
దీంతో ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో బోగీలో ఇద్దరు మహిళలు ఊపిరాడక మృతిచెందగా, 30 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి 10 మృతదేహాలను గుర్తించగా, మరో 20 మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తూ గల్లంతైన వారి కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు రెండేళ్లపాటు నిరీక్షించారు.
రెండేళ్ల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రాలు
చివరకు బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు గుర్తిం చని మృతులకు గౌతమిలో మృతిచెందినట్లుగా 2010, ఏప్రిల్‌లో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో రైల్వేశాఖ, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పొందగలిగారు. ఈ ఘటన జరిగిన రోజు కేసముద్రం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన తెల్లవారుజామున రైల్వే ఉన్నతాధికారులతోపాటు, అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి నారాయణ్‌బావ్‌రత్వా, రైల్వే సేఫ్టీ కమిషన్ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కేసముద్రం తరలివచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలిబూడిదైన గౌతమి బోగీలోకి ఎక్కి పరీశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చా రు. దేశం నలుమూలల నుంచి ఉన్నతాధికారులు, మంత్రులు, ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పది రోజులకుపైగా మృతిచెందిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడే తిరగడం, కలిసిన అధికా రులకు తమ గోడును వెల్లబోసుకోవడంవంటి హృదయ విదా రక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
కాలిబూ డిదైన బోగిలను చూసేందుకు వచ్చిన చుట్టుపక్క ల వారంతా అస్థి పంజరాలు, కలేబరాలను చూసి తట్టుకోలేకపోయారు. ఈ ఘటనలో చిన్నపిల్లలు సైతం కాలిబూడిదయ్యారు. గౌతమి ఘటన జరిగి న పదిరోజులపాటు ఈ ప్రాంతమంతా దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. రైల్వే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రోజులపాటు కాజీపేట–విజయవాడ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జులై 31 వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజల కళ్లెదుట గౌతమి ఘటన కదలాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment