Gowthami Express Train
-
గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్లాట్‌ఫామ్‌ల మార్పు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రైల్వే స్టేషన్లో ఒకే చోట ఎక్కువ రద్దీ ఏర్పడకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పక్కపక్క ప్లాట్‌ఫామ్స్‌లోకి ఒకేసారి మూడు, నాలుగు రైళ్లు వచ్చే వేళల్లో కొన్ని రైళ్లను దూరంగా ఉన్న వేరే ప్లాట్‌ఫామ్స్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈనెల 12 (నేటి) నుంచి 21 వరకు మూడు ప్రధాన రైళ్లలో ఈ మార్పులు చేశారు. హైదరాబాద్–విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 1కి బదులు ప్లాట్‌ఫామ్ 10 నుంచి బయల్దేరుతుంది. లింగంపల్లి–కాకినాడ పోర్టు గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా ప్లాట్‌ఫామ్ 1కి బదులు 10 నుంచి బయల్దేరుతుంది. ఇక హజ్రత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెం 10 నుంచి కాకుండా ప్లాట్‌ఫామ్ 1 నుంచి బయల్దేరుతుంది. కాగా, సికింద్రాబాద్ స్టేషన్లో మాస్కులు ధరించని 169 మంది నుంచి రూ.34,100ను పెనాల్టీగా వసూలు చేశారు. ( సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు) -
‘గౌతమి’ దుర్ఘటనకు పదేళ్లు
కేసముద్రం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాద దుర్ఘటన జరిగి నేటికీ పదేళ్లయింది. 2008 జులై 31న అర్ధరాత్రి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు డౌన్‌లైన్‌లో వెళ్తున్న గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కేసముద్రం – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య అగ్ని ప్రమాదానికి గురై కొద్దినిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించి ఎస్ 9, 10, 11, 12 బోగీలు అంటుకున్నాయి. దీంతో ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో బోగీలో ఇద్దరు మహిళలు ఊపిరాడక మృతిచెందగా, 30 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి 10 మృతదేహాలను గుర్తించగా, మరో 20 మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తూ గల్లంతైన వారి కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు రెండేళ్లపాటు నిరీక్షించారు. రెండేళ్ల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రాలు చివరకు బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు గుర్తిం చని మృతులకు గౌతమిలో మృతిచెందినట్లుగా 2010, ఏప్రిల్‌లో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో రైల్వేశాఖ, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పొందగలిగారు. ఈ ఘటన జరిగిన రోజు కేసముద్రం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన తెల్లవారుజామున రైల్వే ఉన్నతాధికారులతోపాటు, అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి నారాయణ్బావ్రత్వా, రైల్వే సేఫ్టీ కమిషన్ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కేసముద్రం తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలిబూడిదైన గౌతమి బోగీలోకి ఎక్కి పరీశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చా రు. దేశం నలుమూలల నుంచి ఉన్నతాధికారులు, మంత్రులు, ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పది రోజులకుపైగా మృతిచెందిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడే తిరగడం, కలిసిన అధికా రులకు తమ గోడును వెల్లబోసుకోవడంవంటి హృదయ విదా రక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాలిబూ డిదైన బోగిలను చూసేందుకు వచ్చిన చుట్టుపక్క ల వారంతా అస్థి పంజరాలు, కలేబరాలను చూసి తట్టుకోలేకపోయారు. ఈ ఘటనలో చిన్నపిల్లలు సైతం కాలిబూడిదయ్యారు. గౌతమి ఘటన జరిగి న పదిరోజులపాటు ఈ ప్రాంతమంతా దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. రైల్వే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రోజులపాటు కాజీపేట–విజయవాడ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జులై 31 వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజల కళ్లెదుట గౌతమి ఘటన కదలాడుతుంది. -
అర్ధరాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ యత్నం
ఖమ్మం: కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అర్ధరాత్రి 12.30 సమయంలో దొంగలు దోపిడీకి యుత్నించారు. విజయువాడ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న రైలు కొండపల్లి దాటాక ఎనిమిది నుంచి పదిమంది దొంగలు చైన్‌లాగి రైలును ఆపారు. ఎస్-1, ఎస్-2, ఎస్-8 బోగీల్లో ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి వారి వద్దనుంచి నగదు, బంగారు ఆభరణాలను దోచుకునేందుకు యత్నించగా ప్రయాణికులు ప్రతిఘటించారు. దీంతో వారు కొంతసేపు బీభత్సం సృష్టించారు. చివరికి ఎస్ 8 బోగీలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రేవతి వద్ద రెండు తులాల బంగారు గొలుసు దోచుకువెళ్లారు. అలర్ట్ అరుున ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడకు వచ్చేలోగానే దొంగలు పారిపోయూరు. -
‘గౌతమి’ని నిలిపేసిన ప్రయాణికులు
- అదనపు బోగీల కోసం ఆందోళన - కాకినాడలో గంటపాటు పట్టాలపై బైఠాయింపు కాకినాడ, న్యూస్‌లైన్: అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు ప్రయాణికులు బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సాంబమూర్తినగర్ పోర్టు రైల్వే స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగింది. సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి జిల్లా వాసులు వేలాదిగా వచ్చారు. వారంతా గురువారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. స్టేషన్ సిబ్బంది టిక్కెట్లు అధికంగా ఇవ్వడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఉన్న బోగీలు కిక్కిరిసిపోయాయి. దీంతో మిగిలినవారంతా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలంటూ సుమారు గంటపాటు రైలును నిలిపేశారు. ఓటు వేసేందుకు వచ్చిన తాము తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలున్నాయని, వీటిలో 3 మాత్రమే సెకండ్ క్లాస్ బోగీలని రైల్వే అధికారి మురళీకృష్ణ తెలిపారు. అదనపు బోగీల ఏర్పాటు తమ పరిధిలో లేదన్నారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే అధికారులతో మాట్లాడామని, ప్రయాణికులను రిజర్వేషన్ బోగీల్లో తరలించేందుకు అనుమతించారని చెప్పారు. చివరకు రైలు బయలుదేరడంతో కొంతమంది కిక్కిరిసిన బోగీల్లోనే ప్రయాణించగా, మరికొందరు వెనుదిరిగారు.