62 కిలోల వెండి స్వాధీనం
చిన్నమండెం(సంబేపల్లె) :
కడప-చిత్తూరు జాతీయ రహదారిలో సంబేపల్లె మండలం దేవపట్ల మిట్టమీద ఆదివారం ఉదయం వాహనాల తనిఖీలో భాగంగా 62 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రుష్యేంద్రబాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆదివారం ఉదయం దేవపట్ల మిట్టమీద వాహనాల తనిఖీలో భాగంగా తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి ప్రొద్దుటూరుకు వెళుతున్న కారును సోదా చేశారు. అందులోని వ్యక్తులను విచారించగా తొలుత అరకిలో మేర కాళ్లకు వేసుకునే వెండి గొలుసులు చూపించారు.
అనుమానం రావడంతో కారులో తనిఖీ చే యగా 62 కిలోల వెండి దొరికింది. విషయం తెలుసుకున్న రాయచోటి రూరల్‌సీఐ రాజేంద్రప్రసాద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్న వెండిని సీజ్ చేశారు. వాటికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో మురుగేష్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి బిల్లులు అందజేయకపోతే సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులకు వెండిని అప్పగిస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు రాజగోపాల్, మోహన్, అమీర్ పాల్గొన్నారు.