సమ్యక్ దృష్టితో.. సమగ్ర వికాసం | 68th Independence day celebrations | Sakshi
Sakshi News home page

సమ్యక్ దృష్టితో.. సమగ్ర వికాసం

Published Sat, Aug 16 2014 12:49 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

సమ్యక్ దృష్టితో.. సమగ్ర వికాసం - Sakshi

సమ్యక్ దృష్టితో.. సమగ్ర వికాసం

సాక్షి, కాకినాడ : తమ ప్రభుత్వం అన్నిరంగాలనూ అభివృద్ధి పథంలో పయనింప చేసేందుకు అవసరమైన దృక్పథంతో ముందుకు వెళుతోందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపు నిచ్చారు. అర్ధశతాబ్దికి పైగా కలిసికట్టుగా సాగిన తెలుగు జాతి అనుకోని పరిస్థితుల్లో విడిపోయినా.. ఉమ్మడి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన రీతిలోనే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకునేందుకు స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహనీయులను స్ఫూర్తితో పయనించాలని పిలుపునిచ్చారు.

68వ స్వాతంత్య్ర దినోత్సవాలను స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించిన చినరాజప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్, ఏపీఎస్‌పీ, ఎన్‌సీసీ, హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు చోడిశెట్టి హనుమంతరావును ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

4 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్ల రుణమాఫీ
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా అమలు చేస్తున్న రుణమాఫీ వల్ల జిల్లాలో  4 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్ల మేర రుణాలు మాఫీ కానున్నాయని రాజప్ప చెప్పారు. 80 వేల డ్వాక్రా సంఘాలకు రూ.800 కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు. ఈ ఏడాది 2.50 లక్షల మంది కౌలురైతులకు రుణఅర్హత కార్డులు జారీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.10 లక్షలమందిని గుర్తించామని, త్వరలో కార్డులు అందజేస్తామని చెప్పారు. రానున్న వంద రోజుల్లో 1,314 హెక్టార్లలో బిందుసేద్యం విస్తరణకు సంకల్పించామన్నారు.

హెలెన్ బాధిత రైతులకు రూ.124 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
గతేడాది హెలెన్ తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు రూ.124 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయనున్నట్టు రాజప్ప చెప్పారు. రూ.14 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందజేయనున్నట్టు చెప్పారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 1.45 లక్షల ఎకరాలకు, ముసురుమిల్లి ద్వారా 22 వేల ఎకరాలకు, భూపతిపాలెం ద్వారా 11,526 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో నీరందిస్తున్నామన్నారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏడున్నరలక్షల ఎకరాలకు నీరందించేలక్ష్యంతో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించామని, ఎడమకాలువ పనులు 57 శాతం పూర్తయ్యాయని చెప్పారు.

వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను అక్టోబర్ 2 నుంచి రూ.1000 నుంచి రూ.1500ల మేర పెంచనున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 602 ఆవాస ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి అక్టోబర్ 2 నుంచి రూ.2లకే 20 లీటర్లు అందించనున్నామన్నారు. పదో తరగతిలో 96.26 శాతం ఉత్తీర్ణతతో గతేడాది అగ్రస్థానంలో నిలిచిన జిల్లా రానున్న ఏడాది కూడా ఇదే స్థానాన్ని పదిలపర్చుకునేందుకు కృషి చేయాలన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా రూ.64 కోట్లతో 111 అదనపు తరగతి గదులు, రూ.6 కోట్లతో 765 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆధార్ నంబర్ జారీలో, ఆధార్ సీడింగ్‌లో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ పథకాలనూ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు.

సీఎస్‌ఆర్ నిధులతో కాకినాడ జీజీహెచ్‌కు హంగులు
రూ.6.70 కోట్ల కార్పొరేట్ సంస్థలిచ్చే సీఎస్‌ఆర్ నిధులతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు రూ.1.40 కోట్లతో పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు రాజప్ప చెప్పారు. హోం మంత్రిగా జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నానని, ఇందుకోసం 34 పోలీస్ స్టేషన్లలో 119 టోల్‌ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. పెద్దాపురంలో రూ.10 కోట్లతో రాష్ర్ట విపత్తుల నిర్వహణా సంస్థ (ఎస్‌డీఆర్‌ఎఫ్) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రూ.7.50 కోట్లతో టెంపుల్ టూరిజం ప్రాజెక్టు
జిల్లాలో రూ.7.50 కోట్లతో పిఠాపురం, సర్పవరం, ద్రాక్షారామ, సామర్లకోటల మధ్య చేపట్టనున్న టెంపుల్ టూరిజం ప్రాజెక్టు పనులకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని రాజప్ప తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇటీవల  రాజమండ్రిలో సమావేశమైందని, పుష్కరాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందిస్తు న్నారని చెప్పారు. జిల్లాలో 21 మండలాల్లో రూ.5.23 కోట్లతో చేపట్టిన పైకా భవనాలు పూర్తి కావచ్చాయని, నియోజక వర్గానికొకటి చొప్పున రూ.2.10 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలు నిర్మిస్తున్నామని చెప్పారు.
 
అధికారులకు, సిబ్బందికి సేవా పురస్కారాలు
ఏడుగురు జిల్లా అధికారులు, 12 మంది బ్యాంకు అధికారులతో కలిసి వివిధ శాఖలకు సంబంధించి 646 మంది అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలను రాజప్ప అందజేశారు. వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా రూ.2.82 లక్షల విలువైన ఉపకరణాలను 62 మంది లబ్ధిదారులకు అందజేశారు. డీఆర్‌డీఏ ద్వారా రూ.89 కోట్లు, మెప్మా ద్వారా రూ.14 కోట్ల బ్యాంకు లింకేజ్‌ను స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. వివిధ శాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించేలా నిర్వహించిన శకటాల ప్రదర్శనలతో పాటు ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, ఎస్పీ ఎం.రవిప్రకాష్, అడ్మిన్ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ప్రకాష్ జాదవ్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement