హైదరాబాద్ ఉండగా... మళ్లీ విజయవాడ ఎందుకు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉండగా... మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జాతీయజెండాను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎగురవేశారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ... రాష్ట్ర రాజధాని ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై నిప్పులు చెరిగారు.
తాత్కాలిక రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని ఆరోపించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపై అన్ని పార్టీల ఆమోదం ఉండాలిని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు చిరంజీవి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ బోత్స సత్యనారాయణతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.