ప్రకాశం / కంభం : రిపబ్లిక్ డే రోజు పాఠశాలలో జెండా వందనం కార్యక్రమానికి హాజరయ్యేందుకు త్వరత్వరగా తయారై కొత్త దుస్తులు వేసుకొని స్కూల్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముక్కుపచ్చలారని పసివాడిని మృత్యువు జీపు రూపంలో వచ్చి ఉసురు తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆరేళ్ల తమ పిల్లాడు ఒక్కసారిగా జీపు కింద పడి చనిపోవడంతో విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. వివరాలు.. స్థానిక కాప వీధిలో నివాసం ఉంటున్న నాగరాజు, స్వాతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నాగసాయి గౌతం(6) ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకొని తన వద్ద ఉన్న చిన్న సైకిల్‌పై స్నేహితులతో కలిసి స్కూల్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. వీధిలోని ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద అరటి పండ్ల లోడుతో వస్తున్న జీపు ఢీకొనడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రు, బంధువులు పరుగులు తీసుకుంటూ సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వై.శ్రీహరి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. స్థానికులను విచారించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అన్నా రాంబాబు పరామర్శ
ప్రమాదంలో మృతి చెందిన బాలుడి మృతదేహానికి వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు నివాళులర్పించారు. సాయంత్రం మృతుడి ఇంటికి వచ్చిన ఆయన.. బాలుడి మృతదేహానికి పూలమాల వేసి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు
Comments
Please login to add a commentAdd a comment