
గుడ్లూరు: ఓ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి ఊపిరి ఆగిపోయింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు వద్ద బుధవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రి శ్రీనివాసాచార్యులు తన భర్య రాజ్యలక్ష్మితో కలసి ఒంగోలు నగరంలోని అయ్యప్ప స్వామిగుడిలో జరిగే పవిత్రమాస పూజోత్సవాల్లో పాల్గొనేందుకు తెల్లవారుఝామున 5 గంటలకు కారులో ఒంగోలుకు బయలు దేరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న చేవూరు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి.. తమిళనాడు నుంచి విజయవాడకు వెళ్తున్న రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వెనుక వైపు వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో శ్రీనివాసాచార్యులు (58), కారు డ్రైవర్ పురుషోత్తమరావు (30) ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్రగాయాలైన రాజ్యలక్ష్మి (55)ని 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందింది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీరామ్, ఎస్‌ఐ మల్లికార్జున ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్ సేఫ్టీ పోలీసులు లారీ కింద ఇరుక్కుపోయిన కారును జేసీబీ ద్వారా బయటకు లాగి మృతదేహాలను తీశారు. జరిగిన దుర్ఘటనపై లారీ డ్రైవర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రీనివాసాచార్యులుకు ఇద్దరు కుమారులున్నారు. మృతుడి స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ మండలం దింటకూరు గ్రామం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment