కృష్ణా విశ్వవిద్యాలయం ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్ కళాశాలల యువజనోత్సవాలు డిసెంబర్ ఏడు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య వి.వెంకయ్య చెప్పారు.
విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణా విశ్వవిద్యాలయం ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్ కళాశాలల యువజనోత్సవాలు డిసెంబర్ ఏడు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య వి.వెంకయ్య చెప్పారు. శుక్రవారం ఆయన కేబీఎన్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన సృజనాత్మకశక్తిని వెలికితీసేందుకు ఈ యువజనోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ‘కృష్ణా తరంగ్- 2013’పేరుతో నిర్వహిస్తున్నామని, యువజ నోత్సవాలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరుగుతాయని చెప్పారు.
25 అంశాల్లో పోటీలు.. ఆరు రంగాలకు సంబంధించి 25 అంశాల్లో ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. మ్యూజిక్ విభాగంలో ఎనిమిది అంశాలు, డ్యాన్స్ విభాగంలో రెండు, లిటరరీ విభాగంలో మూడు, థియేటర్ విభాగంలో నాలుగు, ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఏడు, ఇన్‌స్టలేషన్ తదితర అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలలకు చెందిన 25 సంవత్సరాల లోపు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, టీం మేనేజర్లు తమ దరఖాస్తులను ఈ నెలాఖరులోపు విశ్వవిద్యాలయం మొయిల్‌కు పంపుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామన్నారు. యువజనోత్సవాల్లో ఎంపిక చేసిన విద్యార్థులు డిసెంబర్ 19 నుంచి బెంగళూరులో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయం యువజనోత్సవాలకు కృష్ణా విశ్వవిద్యాలయం పక్షాన హాజరవుతారని పేర్కొన్నారు. గత ఏడాది సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్‌లో తమ విద్యార్థులు పలు బహుమతులను సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో విశ్వవిద్యాలయ భవన నిర్మాణాలు
త్వరలో విశ్వవిద్యాలయానికి నిర్దేశించిన భవన నిర్మాణాలు జరుగుతాయని ఆచార్య వెంకయ్య తెలిపారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు కోట్లు, యూజీసీ నుంచి రెండున్నర కోట్లు, ఇతర కేటాయింపులు మరో ఐదు కోట్లు మొత్తం పన్నెండున్నర కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.