సాక్షి, చిత్తూరు: సమైక్యరాష్ట్రం కోసం రెండు నెలలుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలు అత్యవసర ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం లేకపోవడంతో దూరప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడం నరకప్రాయంగా మారుతోంది. దీనికి తోడు శుక్రవారం నుంచి 72 గంటల పాటు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్ సీపీ పిలుపు ఇవ్వటంతో ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేశాఖ సామాన్యుని కడగండ్లు పట్టించుకునే పరిస్థితిలో లేదు.
దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు బోగీల్లో కనీసం కాలుమోపే స్థలం లేకున్నా అవస్థలు పడుతూ వెళుతున్నారు. దీంతో తిరుపతి నుంచి వచ్చిపోయే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అ య్యాయి. ఏటా ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది ఇలా వచ్చే వారికి రైలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అయినా దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్యాసిం జర్ రైళ్లకు ఇంతవరకు అదనపు బోగీలు అమర్చలేదు.
కేవలం ఆదాయం సమకూరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరికొన్ని సూపర్‌ఫాస్టు రైళ్లకు మాత్రమే ఒకటి రెండు అదనపు బోగీలు వేసి చేతులు దులుపుకుంది. ఇక తిరుపతి కాట్పాడి మార్గంలో అయితే ప్యాసింజర్ రైలు బోగీల్లో లోపల స్థలం లేక డోర్‌వద్ద వేలాడుతూ, ఒక్కొక్కసారి ట్రైన్‌పైకి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా విజయవాడ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు లేవు. టిక్కెట్లు మాత్రం అడిగినంతమందికి ఇస్తున్నారు. చెన్నయ్ రూట్లోనూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒక్క అదనపు బోగీ వేయలేదు. ఈ క్రమంలో అత్యవసర పనులపై వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు.
దోచేస్తున్న ప్రైవేట్ వాహనాలు
రైళ్లతో పాటు నిత్యం వేలాదిమంది సుమోలు, టెంపోలు, సెవెన్‌సీటర్ ఆటోలను ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నారు. బస్సులు లేకపోవడం, ప్రయాణికుల అవసరాలను అదనుగా తీసుకున్న ప్రైవేట్ వాహనాలవారు కనీస దూరానికి కూడా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. చిత్తూరు నుంచి పీలేరుకు సెవెన్‌సీటర్లు, ఇతర మామూలు వాహనాల్లో రూ.100, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లలో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు తప్పడం లేదు.
ప్రయాణం.. నరకం!
Published Sat, Oct 5 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement