8.5 లక్షల మంది ఎక్కడి వారక్కడే | 8.5 lakhs employees to be alloted to respictive states | Sakshi
Sakshi News home page

8.5 లక్షల మంది ఎక్కడి వారక్కడే

Published Sun, Aug 3 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

8.5 లక్షల మంది ఎక్కడి వారక్కడే

8.5 లక్షల మంది ఎక్కడి వారక్కడే

ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ
వారికి విభజనతో సంబంధం లేదు, ఆప్షన్లు లేవు
మల్టీ జోనల్‌లోని వెయ్యి మంది సహా రాష్ట్ర కేడర్‌లో 52 వేల మందికే ఆప్షన్లు
ఉద్యోగుల పంపిణీ హడావుడిగా అంటే కుదరదు
చాలా నెలల సమయం పడుతుంది
పంపిణీకి ఆరు అంచెల ప్రక్రియ
కేడర్ సంఖ్య ఖరారుకు కమిటీ, అభ్యంతరాలకు సమయం
ఆప్షన్లకు రెండు వారాల గడువు
తాత్కాలిక పంపిణీ జాబితాపై మూడు లేదా నాలుగు వారాల గడువు


హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పనిచేస్తున్న 8.50 లక్షల మంది ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే కొనసాగుతారని కమలనాథన్ కమిటీ స్పష్టం చేసింది. వారందరినీ అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు కమలనాథన్ కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 8.50 లక్షల మంది ఉద్యోగులకు విభజన  పంపిణీతో సంబంధం లేదని, వారి నుంచి ఎటువంటి ఆప్షన్లు తీసుకోబోమని కమలనాథన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరూ అపోహలు, సందేహాలు పడాల్సిన అవసరం లేదని కమిటీ సభ్యుల్లో కొందరు శనివారం విలేకరులతో చెప్పారు. కేవలం ఉభయ రాష్ట్రాల్లో మల్టీ జోనల్ పోస్టుల్లో... అది కూడా కొన్ని నిర్ధారించిన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వెయ్యి మంది రాష్ట్ర కేడర్‌కు చెందిన వారికే విభజన పంపిణీ వర్తిస్తుందని కమిటీ వివరించింది. ఆ వెయ్యి మంది ఉద్యోగులతో సహా ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్‌లోని 52 వేల మంది ఉద్యోగులను మాత్రమే కమిటీ పంపిణీ చేయనుంది. ఈ 52 వేల మంది నుంచి మాత్రమే కమిటీ ఆప్షన్లను తీసుకోనుంది. ఉద్యోగుల పంపిణీ హడావుడిగా చేయడం సాధ్యం కాదని, ఇందుకోసం చాలా నెలల సమయం పడుతుందని కమిటీ అభిప్రాయపడింది. స్థానికత విషయంలో కూడా ముసాయిదా మార్గదర్శకాల్లో స్పష్టంగా రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రమాణికంగా పేర్కొన్నందున, ఈ విషయంలో కూడా సందేహాలకు తావు లేదని పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పదవ తరగతి వరకు గత నాలుగేళ్లలో వరుసగా ఎక్కడ చదివితే అదే స్థానికత అవుతుందని కమిటీ స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారనే దానితో విభజన పంపిణీకి సంబంధం లేదని తేల్చింది. ఉద్యోగుల పంపిణీ కొలిక్కి తేవాలంటే ఆరు అంచెల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని, ఇందుకోసం చాలా నెలల సమయం పడుతుందని చెబుతోంది. ప్రస్తుతం ఎవరి నుంచి ఆప్షన్లు తీసుకోవడం లేదని, తుది మార్గదర్శకాలు ఖరారు చేసిన తరువాతనే ఆప్షన్లు తీసుకుంటామని, ప్రస్తుతం ఆప్షన్ ఫారాలపై అభిప్రాయాలు చెప్పాలని మాత్రమే కోరామని కమిటీ వివరించింది.  ఉద్యోగుల పంపిణీకి కమిటీ అనుసరించే ఆరు అంచెల ప్రక్రియ ఈ విధంగా ఉండనుంది.

ముసాయిదా మార్గదర్శకాలపై ఈ నెల 5వ తేదీలోగా అందిన అభ్యంతరాలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు.వాటిపై ఈ నెల 13వ తేదీన కమలనాథన్ కమిటీ (ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు కలిసి) సమావేశమవుతుంది.ఆ సమావేశంలో సలహాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల పంపిణీకి తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది.

ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ ఆమోదానికి పంపుతారు. అక్కడ నుంచి ఆమోదం లభించిన తరువాత ఇరు రాష్ట్రాల కేడర్ సంఖ్యను ఖరారు చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇరు రాష్ట్రాలకు కేడర్ సంఖ్యను ఖరారు చేసిన తరువాత ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలకు కొంత సమయం ఇస్తారు.అనంతరం తుది కేడర్ సంఖ్యను ఖరారు చేసి కేంద్ర ఆమోదానికి
 పంపుతారు.కేంద్రం నుంచి ఆమోదం వచ్చేలోగానే సమాంతరంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లను కోరతారు.
  ఆప్షన్లు ఇచ్చేందుకు రెండు వారాలు గడువు ఇస్తారు.అనంతరం తాత్కాలిక ఉద్యోగుల పంపిణీ జాబితాను ప్రకటిస్తారు. అంటే ఏ రాష్ట్రంలో ఏ ఉద్యోగి పనిచేయాలో తాత్కాలిక జాబితాలో ఉంటుంది.

తాత్కాలిక ఉద్యోగుల పంపిణీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మూడు లేదా నాలుగు వారాల పాటు గడువు ఇస్తారు.
 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన ఉద్యోగుల తుది పంపిణీ జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 76 వేలు ఉండగా అందులో పనిచేస్తున్న వారి సంఖ్య 51 వేల మంది ఉన్నారు. మల్టీ జోనల్‌లో రాష్ట్ర కేడర్‌లో పనిచేస్తున్న వారి సంఖ్య వెయ్యి ఉంది. వీరికి మాత్రమే పంపిణీ వర్తిస్తుంది. మల్టీ జోనల్‌లో అంటే ఐజీడీఎస్, మైనింగ్ వంటి ప్రాజెక్టుల్లో రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement