అందరికీ ఆప్షన్!
* విభజన చట్టం ప్రకారం తప్పనిసరి
* సుదీర్ఘ భేటీలో కమలనాథన్ కమిటీ నిర్ణయం
* అయినా సర్వీస్ రిజిస్టర్‌లోని ‘స్థానికత’కే తొలి ప్రాధాన్యం
* అదనపు ఉద్యోగుల విషయంలో ఆప్షన్ల పరిశీలన
* సీనియారిటీ ప్రకారం రోస్టర్ విధానంలో బదలాయింపు
* ఉద్యోగుల విభజనకు ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు
* రెండు మూడు రోజుల్లో వెల్లడి
* అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు పది రోజుల గడువు
* తర్వాతే కేంద్రానికి తుది మార్గదర్శకాలు
* ప్రధాని ఆమోదంతో ఉద్యోగుల కేటాయింపు
* ఇరు రాష్ట్రాల అంగీకారంతో మార్పులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ఓ నిర్ణయానికొచ్చింది. రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం ఆప్షన్లు తీసుకుంటూనే.. సర్వీస్ రిజిస్టర్‌లో పేర్కొన్న స్థానికత ఆధారంగా తొలుత ఆ ప్రాంతానికే ఉద్యోగులను కేటాయించాలన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. అంటే రాష్ర్ట కేడర్‌లోని సుమారు 51 వేల మంది ఉద్యోగులందరూ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగుల విభజన సమయంలో సర్వీస్ రిజిస్టర్‌లో పేర్కొన్న స్థానికతకే తొలి ప్రాధాన్యముంటుందన్నమాట! ఈ పద్ధతిలో ముందుగా ఇరు రాష్ట్రాలకూ కేటాయింపులు జరుగుతాయి.
ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్య అక్కడి పోస్టుల కన్నా ఎక్కువగా ఉన్న సందర్భంలో మాత్రం వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులోనూ సీనియారిటీ ప్రకారం రోస్టర్ విధానాన్ని పాటిస్తూ అదనపు ఉద్యోగులను తక్కువ ఉద్యోగులు ఉన్న రాష్ట్రానికి కేటాయిస్తారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. అంద రికీ ఆప్షన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడంతో కమలనాధన్ కమిటీ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించే వ్యవహారాన్ని ఇక పక్కనబెట్టినట్లయింది.
సోమవారం సచివాలయంలోని ఎల్ బ్లాకులో సమావేశమైన కమలనాథన్ కమిటీ.. ఉద్యోగుల పంపిణీపై సుదీర్ఘంగా చర్చించి ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మ, ప్రత్యేక అహ్వానితులుగా తెలంగాణ నుంచి ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఏఎస్ అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం కమలనాథన్‌తో పాటు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి. రమేశ్ మీడియాకు వివరాలు తెలిపారు.
త్వరలోనే ప్రభుత్వ వెబ్‌సైట్లలో మార్గదర్శకాలు
కమిటీ ఖరారు చేసిన ముసాయిదా మార్గదర్శకాలను రెండు మూడు రోజుల్లో ఇరు రాష్ర్ట ప్రభుత్వాల వెబ్‌సైట్లలో ఉంచనున్నట్లు కమలనాథన్ వెల్లడించారు. వాటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడానికి పది రోజుల గడువిస్తామని చెప్పారు. ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చిన అభ్యంతరాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని తిరిగి తుది మార్గదర్శకాలను కమిటీ ఖరారు చేస్తుందని, వాటినే కేంద్రం ఆమోదానికి పంపుతామని వివరించారు.
ప్రధాని ఆమోదం లభించిన తుది మార్గదర్శకాల ప్రకారం తొలుత ప్రతీ విభాగంలోని కేడర్ పోస్టులను, ఖాళీల సంఖ్యను ప్రకటిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర కేడర్‌లోని 51 వేల మంది ఉద్యోగుల నుంచి ఆప్షన్లు అడుగుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం రెండు వారాల సమయం ఇస్తామన్నారు. స్థానిక, సీనియారిటీ అంశాలకు సంబంధించి మొత్తం మార్గదర్శకాల్లోని పది అంశాలను కలిపి చూస్తేనే స్పష్టత వస్తుందని తెలిపారు. రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఆమోదయోగ్యంగా మార్గదర్శకాలు ఉంటాయన్నారు. ఇప్పటికే రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకూ మార్గదర్శకాల గురించి వివరించామని చెప్పారు.
ఆప్షన్లను బట్టి ఏ ప్రాంతంలో ఎంత మంది ఉండాలనుకుంటున్నారో తెలుస్తుందని, దాన్ని బట్టి ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని కమలనాథన్ పేర్కొన్నారు. ఆ తర్వాతే ఉద్యోగులకు తాత్కాలిక కేటాయింపులు చేస్తామని, దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది కేటాయింపులు జరుపుతామని తెలిపారు. అప్పటికీ అభ్యంతరాలుంటే మాత్రం ఇరు రాష్ట్రాలు చర్చించుకుని పరస్పర అంగీకారంతో ఉద్యోగుల మార్పిడికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చునని అధికారులు వ్యాఖ్యానించారు.