ముంపు ఉద్యోగుల దారెటు..? | not mentioned about employees in kamalanathan during procedures | Sakshi
Sakshi News home page

ముంపు ఉద్యోగుల దారెటు..?

Published Mon, Jul 28 2014 2:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

not mentioned about employees in kamalanathan during procedures

 పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు ఎటువైపు అనే విషయంపై ప్రస్తుతం విస్తృతంగా చర్చసాగుతోంది. ఉద్యోగుల పంపకాలపై ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ ప్రకటించిన విధి విధానాల్లో కేవలం రాష్ట్రస్థాయిలో పని చేసే వారినే పరిగణలోకి తీసుకున్నారు. జిల్లా, జోనల్ స్థాయిలో పని చేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడేనంటూ పేర్కొన్నారు. కానీ ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా ఆ ప్రస్థావన లేకపోవటం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

 స్వాధీనం చేసుకునే దిశగా ఆంధ్ర ప్రభుత్వం
 ఆ ఏడు మండలాల్లోని ప్రజలకు అన్ని సేవలు తామే అందిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ముంపు మండలాల్లో పర్యటించేందుకు వస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ మండలాల్లో పాలనను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎటువైపు వెళ్లాలి అనే అంశంపై ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది.

 ఈ ఏడు మండలాల్లో పని చేస్తున్న వారిలో సుమారు 80 శాతం మంది తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా జిల్లాలోని కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ, మణుగూరు తదితర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ పని చేస్తున్నారు. బదిలీల సమయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీరికి ఆప్షన్‌లు ఇచ్చి కోరుకున్న రాష్ట్రంలో పని చేసే అవకాశం కల్పిస్తారా..? లేక ముంపు ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి బదలాయిస్తారా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క జూలై నెల వేతనాల బిల్లులు తీసుకునేందుకు ట్రెజరీ అధికారులు నిరాకరించారు.

 కానీ పై నుంచి వచ్చిన ఒత్తిడి, రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని చివరకు పాస్ చేశారు. ఆగస్టు నెల బిల్లులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాస్ కావని ట్రెజరీ అధికారులు ఖరాఖండీగా చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒకసారి ఆంధ్ర ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వేతనాల బడ్జెట్ ఉండదని, ఇది జరిగితే తాము శాశ్వతంగా ఆంధ్రకు వెళ్లిపోవాల్సి వస్తుందని ఓ ఉద్యోగ సంఘం నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు.

 ఈ పరిణామాలతో ముంపు ప్రాంత ఉద్యోగులకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో కొంత మంది ఉద్యోగులు ముంపు నుంచి బయటకు వచ్చేందుకు సెలవులు పెడుతున్నారు. అనారోగ్య కారణాలను చూపిస్తూ సెలవులపై వెళ్లి ఆ తర్వాత తెలంగాణలో పోస్టింగ్ వేయించుకోవచ్చని చూస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఇందుకు సిద్ధమవుతున్నారు. తాము ఇంత ఆందోళన చెందుతున్నా రాష్ట్రస్థాయిలో ఉన్న ఉద్యోగ సంఘాల వారు పెద్దగా పట్టించుకోవడం లేదని ముంపు ప్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 ఇంతకు  ఈ ఉద్యోగుల ఎటువైపు..?
 ఇదిలా ఉంటే భద్రాచలం మండలంలోని నెల్లిపాక, లక్ష్మీపురం పీహెచ్‌సీల్లో పని చేస్తున్న కొంత మంది క్షేత్రస్థాయి సిబ్బంది సకంట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, అదే విధంగా పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించినందున ఇక్కడ ప్రత్యేక ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. కానీ భద్రాచలం, బూర్గంపాడు మండలాలను రెండుగా చీల్చడంలో సమస్య వచ్చిపడింది.

 బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను కుక్కునూరు మండలంలో విలీ నం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. అదే విధంగా భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మిన హాయించి, మిగిలిని ప్రాంతాలను నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటించి విడదీశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలో(పట్టణం) గల సబ్ సెంటర్‌లలో పనిచేస్తున్న సిబ్బంది నెల్లిపాక పీహెచ్‌సీకి కేటాయించిన బడ్జెట్ నుంచి వేతనాలు పొందాల్సి ఉంది. అదే విధం గా లక్ష్మీపురం పీహెచ్‌సీ పరిధిలోకి వచ్చే మారాయిగూడెం, లచ్చిగూడెం సబ్ సెంటర్లు దుమ్ముగూడెం మండలంలో ఉండిపోతాయి.

అంటే లక్ష్మీపురం పీహెచ్‌సీలో రెండు సబ్‌సెంటర్‌లు ,నెల్లిపాక పీహెచ్‌సీ పరిధిలోని ఏడు సబ్ సెంటర్‌లు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. కానీ వీరికి వేతనాలు మాత్రం ఆయా పీహెచ్‌సీల హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి మంజూరు కావాల్సి ఉంటుంది. వీటిని వేరే పీహెచ్‌సీలలో విలీనం చేసినా, వేతనాల మంజూరుకు ఇబ్బందులు వస్తాయని ఆ శాఖలోని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఇదే రీతిన నర్సాపురం పీహెచ్‌సీ నుంచి కొన్ని సబ్ సెంటర్‌లను దుమ్ముగూడెం పీహెచ్‌సీకి సర్ధుబాటు చేసినప్పటకీ, వారికి మాత్రం నేటికీ నర్సాపురం పీహెచ్‌సీ నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు.

 ప్రస్తుతం ఈ రెండు పీహెచ్‌సీ పరిధిలోని ప్రాంతం రెండుగా విడిపోతున్నందున వీరికి ముంపు ఉద్యోగుల మాదిరే ఆప్షన్‌లు కల్పిస్తారా..? లేక తెలంగాణలోనే వీరిని చూపుతారా ..? అనే దానిపై సందేహాలు ఉన్నాయి. అయితే భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లిపాక, లక్ష్మీపురం పీహెచ్‌సీలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ  ఆప్షన్ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement