చీపురుపల్లి: రాష్ట్రం, జిల్లా, మండలాలు, గ్రామాల్లో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసగంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీటింగ్ కేసులు పెట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబుపై ఈ నెల 8న అన్ని పోలీస్‌స్టేషన్‌లలో చీటింగ్ కేసులు పెట్టనున్నట్లు చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు. ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసగించినందుకు చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరనున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన పాలనందిస్తున్నామని చెప్పుకొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రూ.కోట్లు వెదజల్లి తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా దొరికిపోవడాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు ఆడియో టేపులపై ఫోరెన్సిక్ నివేదికలున్నా, 22 సార్లు చార్జిషీట్లలో నిందితుడిగా పేర్కొన్నా చర్యలు లేవన్నారు.
ఈ నెల 8న ముఖ్యమంత్రిపై పెట్టనున్న చీటింగ్ కేసులు కార్యక్రమానికి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల నాయకుడు ఇప్పిలి అనంతం, బెల్లాన త్రినాథ్, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, పనస అప్పారావు, రఘుమండ త్రినాథ్, రేవల్ల సత్తిబాబు, కోరాడ నారాయణరావు, పతివాడ రాజారావు, మహంతి ఉమ పాల్గొన్నారు.
8న చంద్రబాబుపై చీటింగ్ కేసులు
Published Tue, Jun 7 2016 12:04 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement