సాక్షి, అమలాపురం టౌన్: రోలర్ స్కేటింగ్‌లో ఆ చిన్నారి చిచ్చర పిడుగే.. కాళ్లకు స్కేటింగ్ షూ కట్టుకుని బరిలోకి దిగాడంటే పతకాలూ పరుగులు పెట్టాల్సిందే. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఏడు స్వర్ణ పతకాలు సాధించి అందరితో ఔరా! అనిపించుకున్నాడు. అమలాపురం పట్టణం సూర్యనారాయణపేటకు చెందిన కోటుం కుమార్‌చందుశ్రీధర్ రోలర్ స్పీడ్ స్కేటింగ్‌లో చిరు ప్రాయం నుంచి రాణిస్తున్నాడు. ఇప్పటికే జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఏడు స్వర్ణ పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలను సాధించాడు. అమలాపురం ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న కోటుం నరసింహమూర్తి కుమారుడు శ్రీధర్. తండ్రితో పాటు తల్లి మీనాకుమారి, చెల్లి జాస్మిన్‌ల ప్రోత్సాహంతో శ్రీధర్ స్కేటింగ్‌లో చెలరేగిపోతున్నాడు. తండ్రి నరసింహమూర్తి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తన కుమారుడి అభిరుచికి అనుగుణంగా స్పీడ్ స్కేటింగ్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో ఉన్న స్కేటింగ్ రింగ్‌లోనే తన ప్రతిభకు పదును పెట్టాడు. ఆ స్టేడియం సీనియర్ కోచ్, నేషనల్ ప్లేయర్ కెల్లా రాము తర్ఫీదులో మూడేళ్లుగా రోలింగ్ స్కేటింగ్‌లో పూర్తి మెళకువలు నేర్చుకున్నాడు.
పలు పతకాలు కైవసం
ఐదో ఏట నుంచే కాళ్లకు రోలర్ స్కేట్స్ కట్టుకుని రింగ్‌లోకి అడుగుపెట్టాడు. మూడేళ్లలో వైజాగ్, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో జరిగిన రాష్ట్ర, జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ 2కే19 పోటీల్లో అండర్ 7–9 కేటగిరీలో పాల్గొని రోడ్ స్కేటింగ్ షో, రింగ్‌లో షార్ట్ రేసు, లాంగ్ రేస్ ఈ మూడు కేటగిరీల్లో మొదటి స్థానాల్లో నిలిచి మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. గతంలో భీమవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, వైజాగ్‌ల్లో జరిగిన పోటీల్లో శ్రీధర్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించాడు. శ్రీధర్ అండర్–5 కేటగిరీ నుంచి మొదలు పెట్టిన తన పతకాల ప్రస్థానం అండర్–9 వరకు వరుస విజయాలతో సాగుతోంది. డిసెంబర్‌లో వైజాగ్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీధర్ స్పష్టం చేస్తున్నాడు. ఒకే పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురంలో ఇటీవల ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు.
జాతీయ విజేతను చేయడమే నా లక్ష్యం
శ్రీధర్ రోలింగ్ స్కేటింగ్‌కు సంబంధించి క్వార్డ్ స్కేటింగ్‌లో స్పీడ్ స్కేటింగ్ చేయడంలో దిట్ట. ఇప్పటికే పలు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో విజేతను చేసి స్వర్ణ పతాకం సాధించేలా చేయడమే నా లక్ష్యం. – కెల్లా రాము, స్కేటింగ్ సీనియర్ కోచ్, బాలయోగి స్టేడియం, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment