amalapuram town
-
సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు
సాక్షి, అమలాపురం టౌన్: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్‌ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది. కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ కేన్సర్ సెంటరు పేర చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్‌కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్) -
గుండె శస్త్రచికిత్స కోసం ముంబైకి మంత్రి విశ్వరూప్
అమలాపురం టౌన్: కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురై, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది, అక్కడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గుండె శస్త్రచికిత్సకు శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు సోమవారం గుండె శస్త్రచికిత్స చేస్తారని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంత్రి విశ్వరూప్ తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ముంబై వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయినట్లు కృష్ణారెడ్డి చెప్పారు. -
జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ
సాక్షి, అమలాపురం టౌన్: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. సమావేశం జరుగుతున్న సమయంలో సమనస, ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తీవ్రమై, సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి చేరింది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) కేకలు, అరుపులతో ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. రాజబాబుకు, నియోజకవర్గంలోని కొంత మంది మధ్య ఇటీవల దూరం పెరిగింది. పార్టీ రెండు వర్గాలుగా మారింది. మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు యాళ్ల నాగ సతీష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు కొన్ని నెలల కిందటే రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికను రాజబాబు అడ్డుకుంటున్నారని సతీష్‌తో పాటు పార్టీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల అమలాపురం రావడంతో పార్టీ ఇన్చార్జి రాజబాబు ప్రమేయం లేకుండానే మరో వర్గంగా ఉంటున్న పార్టీ నాయకులతో కలిసి సతీష్ జనసేనలో చేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అప్పటికే నియోజకవర్గ పార్టీలో నాయకులు రెండుగా చీలిపోవడంతో ఇన్నాళ్లూ చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం చర్చనీయాంశమైంది. -
తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు
అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది. సాక్షి, అమలాపురం టౌన్ : పట్టణంలోని కల్వకొలనువీధికి చెందిన పటచోళ్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన విజయవాడకు చెందిన మేరీ సునీత అనే మహిళ ఈ చోరీకి పాల్పడింది. అనంతలక్ష్మి పక్షవాతంతో కదల్లేని పరిస్థితుల్లో మంచంపైనే ఉండి చికిత్స పొందుతోంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో బంధువులు విజయవాడకు చెందిన పనిమనుషులను కుదిర్చే ఓ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ విజయవాడ నుంచి మేరీ సునీత అనే మహిళను అమలాపురంలోని అనంతలక్ష్మి ఇంటికి ఆదివారం పంపించింది. పనిలో చేరిన ఆమెకు వృద్ధురాలికి ఎలాంటి సపర్యలు చేయాలో బంధువులు చెప్పి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో వృద్ధురాలు, తాను మాత్రమే ఉండడాన్ని అవకాశంగా భావించిన ఆ మాయలేడీ వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న బంగారు నగలపై కన్నేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటక వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న 24 కాసుల బంగారు నగలను పట్టుకుని పరారైంది. సోమవారం ఉదయం పని మనిషి కనిపించకపోవడంతో పాటు ఇంట్లో నగలు మాయకావడంతో అది ఆ మహిళ చేసిన పనేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. పనికి కుదిర్చిన కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించినా ఆమె గురించి సరైన సమాచారం రాలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ ఆ వృద్ధురాలి ఇంటిని సందర్శించి ఆమెను విచారించారు. పనిమనిషిగా వచ్చిన మహిళ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను నియమించారు. హైదరాబాద్, విజయవాడలకు సోమవారం ఉదయమే ఆ రెండు పోలీసు బృందాలు బయల్దేరాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ సంస్థను కూడా విచారించనున్నారు. 24 కాసుల బంగారు నగలతో పాటు, రూ.20 వేల నగదు కూడా ఆ మహిళ దోచుకుపోయిందని వృద్ధురాలి బంధువులు అంటున్నారు. -
వీడు ‘గోల్డ్’ ఎహే...
సాక్షి, అమలాపురం టౌన్: రోలర్ స్కేటింగ్‌లో ఆ చిన్నారి చిచ్చర పిడుగే.. కాళ్లకు స్కేటింగ్ షూ కట్టుకుని బరిలోకి దిగాడంటే పతకాలూ పరుగులు పెట్టాల్సిందే. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఏడు స్వర్ణ పతకాలు సాధించి అందరితో ఔరా! అనిపించుకున్నాడు. అమలాపురం పట్టణం సూర్యనారాయణపేటకు చెందిన కోటుం కుమార్చందుశ్రీధర్ రోలర్ స్పీడ్ స్కేటింగ్‌లో చిరు ప్రాయం నుంచి రాణిస్తున్నాడు. ఇప్పటికే జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఏడు స్వర్ణ పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలను సాధించాడు. అమలాపురం ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న కోటుం నరసింహమూర్తి కుమారుడు శ్రీధర్. తండ్రితో పాటు తల్లి మీనాకుమారి, చెల్లి జాస్మిన్ల ప్రోత్సాహంతో శ్రీధర్ స్కేటింగ్‌లో చెలరేగిపోతున్నాడు. తండ్రి నరసింహమూర్తి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తన కుమారుడి అభిరుచికి అనుగుణంగా స్పీడ్ స్కేటింగ్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో ఉన్న స్కేటింగ్ రింగ్‌లోనే తన ప్రతిభకు పదును పెట్టాడు. ఆ స్టేడియం సీనియర్ కోచ్, నేషనల్ ప్లేయర్ కెల్లా రాము తర్ఫీదులో మూడేళ్లుగా రోలింగ్ స్కేటింగ్‌లో పూర్తి మెళకువలు నేర్చుకున్నాడు. పలు పతకాలు కైవసం ఐదో ఏట నుంచే కాళ్లకు రోలర్ స్కేట్స్ కట్టుకుని రింగ్‌లోకి అడుగుపెట్టాడు. మూడేళ్లలో వైజాగ్, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో జరిగిన రాష్ట్ర, జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ 2కే19 పోటీల్లో అండర్ 7–9 కేటగిరీలో పాల్గొని రోడ్ స్కేటింగ్ షో, రింగ్‌లో షార్ట్ రేసు, లాంగ్ రేస్ ఈ మూడు కేటగిరీల్లో మొదటి స్థానాల్లో నిలిచి మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. గతంలో భీమవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, వైజాగ్ల్లో జరిగిన పోటీల్లో శ్రీధర్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించాడు. శ్రీధర్ అండర్–5 కేటగిరీ నుంచి మొదలు పెట్టిన తన పతకాల ప్రస్థానం అండర్–9 వరకు వరుస విజయాలతో సాగుతోంది. డిసెంబర్లో వైజాగ్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీధర్ స్పష్టం చేస్తున్నాడు. ఒకే పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురంలో ఇటీవల ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. జాతీయ విజేతను చేయడమే నా లక్ష్యం శ్రీధర్ రోలింగ్ స్కేటింగ్‌కు సంబంధించి క్వార్డ్ స్కేటింగ్‌లో స్పీడ్ స్కేటింగ్ చేయడంలో దిట్ట. ఇప్పటికే పలు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో విజేతను చేసి స్వర్ణ పతాకం సాధించేలా చేయడమే నా లక్ష్యం. – కెల్లా రాము, స్కేటింగ్ సీనియర్ కోచ్, బాలయోగి స్టేడియం, అమలాపురం -
వైద్య విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం
సాక్షి, అమలాపురం: అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆమె పరిచయస్తుడు కిడ్నాప్ చేసేందుకు యత్నించి విఫలం చెందాడు. చివరకు చిక్కుల్లో పడి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. అనపర్తి ప్రాంతానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కడపకు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అవినాష్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌నకు విఫలయత్నం చేశాడు. ఆ వైద్య విద్యార్థిని సాహసించి ఆ నయవంచకుడి చెర నుంచి తప్పించుకుంది. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదు కావడంతో పాటు అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అమలాపురం, ఐ.పోలవరం మండలం పాత ఇంజరం ప్రాంతాల్లో జరిగింది ఈ సంఘటన. వివరాలిలా.. వైద్య విద్యార్థినికి ఇటీవలే మెడిసిన్ పీజీ చదువుతున్న ఓ యువకుడితో వివాహ నిశ్చితార్థమైంది. ధనిక కుటుంబానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కలిసేందుకు గతం నుంచి పరిచయం ఉన్న అవినాష్ అనే వ్యక్తి సోమవారం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తన స్నేహితుడు అజయ్‌తో కలిసి కారులో వచ్చాడు. ‘నీతో మాట్లాడాలి’ అని ఆ వైద్య విద్యార్థినిని కారు ఎక్కించుకుని అయినవిల్లి వైపు తీసుకు వెళ్లాడు. అప్పటికే ఆ వైద్య విద్యార్థిని తనకు ఏదో హాని తలపెట్టేలా ఉన్నాడని గ్రహించింది. పథకం ప్రకారం ఓ చోట మోటారు సైకిల్‌ను సిద్ధం చేసుకున్న అవినాష్ కారును మధ్యలో తన స్నేహితుడికి అప్పగించి, బైక్‌పై వైద్య విద్యార్థిని ఎక్కించుకుని ఆమెను యానాం– ఎదుర్లంక వంతెన వైపు 216 జాతీయ రహదారిపై తీసుకుని వెళుతుండగా.. తనకు ఏదో కీడు తలపెడుతున్నాడని గమనించిన ఆమె యానాం– ఎదుర్లంక వంతెన ఇవతల పాత ఇంజరం వద్ద రోడ్డు చెంతన ఉన్న ఐ.పోలవరం పోలీసు స్టేషన్ రాగానే బైక్ నుంచి దూకేసింది. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆమెను లేవదీశాడు. అవినాష్ అక్కడి నుంచి బైక్‌పై వేగంగా పరారయ్యాడు. కిడ్నాప్ కేసు నమోదు.. బైక్ నుంచి దూకేసిన విద్యార్థినిని పోలీసు స్టేషన్లోకి తీసుకుని వెళ్లి విచారించారు. తనను అవినాష్ అనే వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించాడని, తనను చంపేస్తాడేమోనని భయంగా ఉందని ఐ.పోలవరం ఎస్సై రాముకు వివరించింది. దీంతో ఆమెను అమలాపురం డీఎస్పీ బాషా వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. సీఐ భీమరాజును దీనిపై దర్యాప్తు చేయమని డీఎస్పీ ఆదేశించారు. అవినాష్ స్నేహితుడిగా కారుతో వచ్చిన అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారైన అవినాష్ కోసం గాలిస్తున్నారు. -
ఆ టైటిల్ గెలిచిన వారిలో తెలుగు కుర్రాడు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : థాయ్‌లాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన జోడీలో ఒకరైన సాయి సాత్విక్ మన తెలుగువాడే. అతని పూర్తి పేరు రాంకిరెడ్డి సాయి సాత్విక్. 2000, ఆగస్టు 13వ తేదీన అమలాపురంలో జన్మించాడు. 2016 నుంచి చిరాగ్ శెట్టితో జోడీగా ఆడుతున్న సాయి సాత్విక్ అప్పటి నుంచి 6 ఇంటర్నేషనల్ టోర్నీలను గెలుచుకున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత టోర్నీలో అన్సీడ్గా బరిలోకి దిగిన వీరు ప్రపంచ ఛాంపియన్లయిన లీ జున్ హూ- యు చెన్ను ఓడించడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చైనా షట్లర్లును 21-19, 18-21, 21-18 తేడాతో ఓడించారు. దీంతో కొత్త చరిత్ర సృష్టించిన వీరి జోడికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాత్విక్ ప్రదర్శన పట్ల జిల్లా వాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అప్పు తీర్చకుంటే రౌడీలతో రుబాబు
రుణాలు వసూలు కాకపోతే రౌడీలను ఆశ్రయిస్తున్న వడ్డీ వ్యాపారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లనీయకుండా ప్రైవేటు సెటిల్మెంట్లు అమలాపురంలో వడ్డీ రేట్లు రూ.10 నుంచి రూ.20 అమలాపురం : అమలాపురంలో రౌడీయిజంపై పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వారి జులుంకు కళ్లెం వేయలేకపోతున్నారు. రౌడీలకు రాజకీయ అండ పుష్కలంగా ఉండటంతో కొన్ని సందర్భా ల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా అవి అరెస్ట్‌ల వరకూ వెళ్లడం లేదు. విజయవాడలో కాల్ మనీ-సెక్స్ రాకెట్ వెలుగు చూసిన నేపథ్యంలో మన జిల్లాలోనూ అప్పులు ఇచ్చిన వారి వేధింపులు, బెదిరింపులు ఎంత వేదనాభరితంగా ఉంటాయో తెలియజెప్పే సంఘటనలు ఉన్నాయి. అమలాపురంలో వడ్డీ వ్యాపారులు రౌడీలను ఆశ్రయించి వసూలు కాని అప్పులపై బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాజకీయ గొడుగు నీడలో.. అమలాపురంలో 150 మందికి పైగా బడా వడ్డీ వ్యాపారులు ఉన్నారు. వీరిలో 40 మంది పెద్ద వ్యాపారులకు అటు రాజకీయ నేతలు ఇటు రౌడీ షీటర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. వీరు ఎవరికి అప్పులు ఇచ్చినా అవి రూ.లక్షల్లోనే ఉంటాయి. వడ్డీ రేట్లు రూ.10 నుంచి రూ.20 వరకూ ఉంటాయి. వడ్డీ నెలనెలా వసూలు అయిపోతున్నంత వరకూ కథ సజావుగానే సాగిపోతుంది. అధిక వడ్డీల భారంతో రుణగ్రస్తుడు కొన్ని నెలల పాటు చెల్లించకపోయినా... ఇక అసలు ఇవ్వలేకపోరుునా వడ్డీ వ్యాపారులు తక్షణమే రౌడీలను ఆశ్రయిస్తారు. అంతే అప్పు తీసుకున్న వారికి ఫోన్లు... బెదిరింపులు మొదలవుతాయి. అదే స్థాయిలో వేధింపులూ ఉంటాయి. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయిద్దామనుకున్నా వారికి ఆ అవకాశం ఇవ్వరు. ప్రైవేటుగా సెటిల్మెంట్ చేస్తారు. అమలాపురంలో రూ.కోట్లు సంపాదించిన ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు రూ.కోట్లల్లోనే అధిక వడ్డీలకు రుణాలు ఇస్తారు. ఓ రుణం వసూలులో ఇబ్బందులు ఎదురుకావటంతో అధికార పార్టీ అండతో రుణగ్రస్తుడిపై పోలీసు కేసులు కూడా పెట్టించాడు. ఈ వ్యాపారి ఓ మంత్రి నా బంధువంటూ పోలీసుల దగ్గర తన దర్పాన్ని ప్రదర్శిస్తాడు. ఓ ప్రజాప్రతినిధి బంధువునంటూ ఓ రౌడీ ప్రైవేటు సెటిల్మెంట్లు తెగ చేస్తున్నాడు. ఓ పోలీసు అధికారి తండ్రి కూడా అధిక వడ్డీలకు రుణాలిస్తు న్నాడు. ఇటీవల ఒక రుణం వసూలు కాకపోతే తీసుకున్న అప్పునకు మించి రుణ గ్రస్తుడి ఆస్తులను రాజకీయ, అధికార అండతో అక్రమంగా జప్తు చేసేస్తున్నారు. 6 గ్యాంగ్‌లు...115 మంది రౌడీలపై కేసులు నమోదు చేసినా... అమలాపురంలో గత ఏడాది కాలంలో రౌడీల ఆగడాలపై పట్టణ పోలీసు స్టేషన్లో అనేక కేసులు నమోదయ్యాయి. పట్టణంలో తరచూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న ఆరు రౌడీ గ్యాంగ్‌లను పోలీసులు గుర్తించి ఆ గ్యాంగ్‌లకు చెందిన మొత్తం 115 మంది రౌడీలపై కేసులు నమోదుచేశారు. ఇందులో కొందరిని పోలీసులు నేరుగా అరెస్ట్ చేయగా... మరికొందరు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులు కాకుండా ఇటీవలే 30 మందిపై కొత్తగా రౌడీ షీట్లు... 44 మందిపై సస్పెక్ట్ షీట్లు (నేర చరిత్ర షీట్లు) తెరిచారు. పోలీసులు ఎంతసేపూ రౌడీ గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు స్కెచ్‌లు వేసుకుని హత్యయత్నాలకు... హత్యలకు వేసుకుంటున్న ఎత్తులు పై ఎత్తులపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వారు ప్రైవేట్ సెటిల్మెంట్లు పేరుతో చేస్తున్న దందాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టం లేదన్న విమర్శలు ఉన్నాయి. రౌడీల వెనుక రాజకీయ నేతల అండదండలు ఉన్నాయన్న కారణంతోనే వారు చేస్తున్న అన్ని రకాల నేరాలపైనా ఒకే రకమైన దృష్టి సారించలేకపోతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.