వైద్య విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం | A Man Tried To Kidnap A Medicine Student In Amlapuram | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం

Published Thu, Aug 22 2019 6:52 AM | Last Updated on Thu, Aug 22 2019 6:52 AM

A Man Tried To Kidnap A Medicine Student In Amlapuram - Sakshi

సాక్షి, అమలాపురం: అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాలలో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆమె పరిచయస్తుడు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించి విఫలం చెందాడు. చివరకు చిక్కుల్లో పడి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. అనపర్తి ప్రాంతానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కడపకు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అవినాష్‌ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌నకు విఫలయత్నం చేశాడు. ఆ వైద్య విద్యార్థిని సాహసించి ఆ నయవంచకుడి చెర నుంచి తప్పించుకుంది. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు కావడంతో పాటు అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అమలాపురం, ఐ.పోలవరం మండలం పాత ఇంజరం ప్రాంతాల్లో జరిగింది ఈ సంఘటన.

వివరాలిలా.. వైద్య విద్యార్థినికి ఇటీవలే మెడిసిన్‌ పీజీ చదువుతున్న ఓ యువకుడితో వివాహ నిశ్చితార్థమైంది. ధనిక కుటుంబానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కలిసేందుకు గతం నుంచి పరిచయం ఉన్న అవినాష్‌ అనే వ్యక్తి సోమవారం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తన స్నేహితుడు అజయ్‌తో కలిసి కారులో వచ్చాడు. ‘నీతో మాట్లాడాలి’ అని ఆ వైద్య విద్యార్థినిని కారు ఎక్కించుకుని అయినవిల్లి వైపు తీసుకు వెళ్లాడు. అప్పటికే ఆ వైద్య విద్యార్థిని తనకు ఏదో హాని తలపెట్టేలా ఉన్నాడని గ్రహించింది. పథకం ప్రకారం ఓ చోట మోటారు సైకిల్‌ను సిద్ధం చేసుకున్న అవినాష్‌ కారును మధ్యలో తన స్నేహితుడికి అప్పగించి, బైక్‌పై వైద్య విద్యార్థిని ఎక్కించుకుని ఆమెను యానాం– ఎదుర్లంక వంతెన వైపు 216 జాతీయ రహదారిపై తీసుకుని వెళుతుండగా.. తనకు ఏదో కీడు తలపెడుతున్నాడని గమనించిన ఆమె యానాం– ఎదుర్లంక వంతెన ఇవతల పాత ఇంజరం వద్ద రోడ్డు చెంతన ఉన్న ఐ.పోలవరం పోలీసు స్టేషన్‌ రాగానే బైక్‌ నుంచి దూకేసింది. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్‌ ఆమెను లేవదీశాడు. అవినాష్‌ అక్కడి నుంచి బైక్‌పై వేగంగా పరారయ్యాడు. 

కిడ్నాప్‌ కేసు నమోదు..
బైక్‌ నుంచి దూకేసిన విద్యార్థినిని పోలీసు స్టేషన్‌లోకి తీసుకుని వెళ్లి విచారించారు. తనను అవినాష్‌ అనే వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించాడని, తనను చంపేస్తాడేమోనని భయంగా ఉందని ఐ.పోలవరం ఎస్సై రాముకు వివరించింది. దీంతో ఆమెను అమలాపురం డీఎస్పీ బాషా వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. సీఐ భీమరాజును దీనిపై దర్యాప్తు చేయమని డీఎస్పీ ఆదేశించారు. అవినాష్‌ స్నేహితుడిగా కారుతో వచ్చిన అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారైన అవినాష్‌ కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement