తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు | Maid Stolen Gold Ornaments, Escaped In Amalapuram | Sakshi
Sakshi News home page

చేరిన రోజే.. చోరీ చేసి..

Jan 5 2021 9:16 AM | Updated on Jan 5 2021 9:59 AM

Maid Stolen Gold Ornaments, Escaped In Amalapuram - Sakshi

వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఐ బాజీలాల్‌

అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది. 

సాక్షి, అమలాపురం టౌన్‌ : పట్టణంలోని కల్వకొలనువీధికి చెందిన పటచోళ్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన విజయవాడకు చెందిన మేరీ సునీత అనే మహిళ ఈ చోరీకి పాల్పడింది. అనంతలక్ష్మి పక్షవాతంతో కదల్లేని పరిస్థితుల్లో మంచంపైనే ఉండి చికిత్స పొందుతోంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో బంధువులు విజయవాడకు చెందిన పనిమనుషులను కుదిర్చే ఓ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ విజయవాడ నుంచి మేరీ సునీత అనే మహిళను అమలాపురంలోని అనంతలక్ష్మి ఇంటికి ఆదివారం పంపించింది. పనిలో చేరిన ఆమెకు వృద్ధురాలికి ఎలాంటి సపర్యలు చేయాలో బంధువులు చెప్పి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో వృద్ధురాలు, తాను మాత్రమే ఉండడాన్ని అవకాశంగా భావించిన ఆ మాయలేడీ వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న బంగారు నగలపై కన్నేసింది.

ఆదివారం అర్ధరాత్రి దాటక వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న 24 కాసుల బంగారు నగలను పట్టుకుని పరారైంది. సోమవారం ఉదయం పని మనిషి కనిపించకపోవడంతో పాటు ఇంట్లో నగలు మాయకావడంతో అది ఆ మహిళ చేసిన పనేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. పనికి కుదిర్చిన కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించినా ఆమె గురించి సరైన సమాచారం రాలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ఎస్‌కే బాజీలాల్‌ ఆ వృద్ధురాలి ఇంటిని సందర్శించి ఆమెను విచారించారు. పనిమనిషిగా వచ్చిన మహిళ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను నియమించారు. హైదరాబాద్, విజయవాడలకు సోమవారం ఉదయమే ఆ రెండు పోలీసు బృందాలు బయల్దేరాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ  తెలిపారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ సంస్థను కూడా విచారించనున్నారు. 24 కాసుల బంగారు నగలతో పాటు, రూ.20 వేల నగదు కూడా ఆ మహిళ దోచుకుపోయిందని వృద్ధురాలి బంధువులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement