జనం లేక బోసిపోయిన కర్నూలు విశ్వేశ్వరయ్య సర్కిల్
సాక్షి, కర్నూలు(సెంట్రల్)/టౌన్: జిల్లాలో శనివారం మరో ఐదు కోవిడ్ (కరోనా) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82కు చేరింది. తాజాగా 108 శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు వచ్చాయి. ఇందులో 103 నెగిటివ్, 5 పాజిటివ్‌గా తేలాయి. పాణ్యంలో 3, బనగానపల్లె మండలం హుస్సేనాపురంలో 1, నంద్యాలలో 1 చొప్పున పాజిటివ్ కేసులు తాజాగా వెలుగుచూశాయి. ఆయా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్, బఫర్ జోన్లుగా ప్రకటించారు.
ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి..
ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా కట్టడికి సహకరించాలని కలెక్టర్ జి.వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. ఎన్ని కేసులు నమోదైనా వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కర్నూలు నగరం, నంద్యాలతో పాటు మరో నాలుగు మునిసిపాలిటీలు, 13 మండలాల్లో పాజిటివ్ కేసులు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కోవిడ్ లక్షణాలు కన్పిస్తే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓలలో ఎవరికో ఒకరికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9441300005కు లేదా 104కు కాల్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే తెలపవచ్చన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు గానీ, ఇతర వ్యాధులకు సంబంధించి గానీ 1077కు ఫోన్ చేస్తే సందేహాలను తీర్చేందుకు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. చదవండి: బయటకొచ్చినందునే బతికిపోయారు
లాక్‌డౌన్ కట్టుదిట్టం
కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 20 నమోదు కావడంతో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. పాజిటివ్ కేసులు నమోదయిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఇప్పటికే పెద్దఎత్తున చేపడుతున్నారు. అలాగే కాలనీల మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలనీలలో ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. రెడ్‌జోన్ ఏరియాల్లో మందుల షాపులు సైతం బంద్ చేయించారు.
తాజాగా నగరంలోని 59 సెక్రటేరియట్, 15 వార్డు పరిధిలోని ప్రజలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలు బయటకు రాకుండా వారికి నిత్యావసరాలు, మందులు, కూరగాయలు ఇంటికే పంపేలా చూస్తున్నారు. ఈ మేరకు నగరపాలక అధికారులు కిరాణా షాపుల యజమానులతో మాట్లాడి.. 40 దుకాణాలను ఎంపిక చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రజలు ఇళ్లలోనే ఉండడంతో పాటు భౌతిక దూరం పాటించాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: నో కరోనా టీం... ఓన్లీ పోలీస్..!
Comments
Please login to add a commentAdd a comment