నగర పాలక కార్యాలయం
సాక్షి, కర్నూలు (టౌన్): కరోనా దెబ్బకు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం మూత పడింది. ఇటీవల ఈ కార్యాలయ కీలక అధికారితో పాటు అతని వద్ద పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయంలోని వారిద్దరి గదులను సీజ్ చేశారు. మూడు రోజులుగా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేస్తే వైరస్ చనిపోతుందని వైద్యులు పేర్కొనడంతో వారి గదులను ఆ విధంగా శుభ్రం చేçస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా శానిటరీ ఇన్‌స్పెక్టర్, మేస్త్రీ, ఇరువురు వార్డు వలంటీర్లు, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, 2 వ డివిజన్ పబ్లిక్ హెల్త్ వర్కర్, 8 వ డివిజన్ హెల్త్ వర్కర్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. (గ్రేటర్ దిగ్బంధం)
భయాందోళనలో ఉద్యోగులు
కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేసే కొంత మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా వారు భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్‌గౌడ్ నేతృత్వంలో కొందరు కలెక్టర్‌ను కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని విన్నవించారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగుల్లో భయాందోళనలు తగ్గుతాయని వారు పేర్కొన్నారు.
మూడు విభాగాలకు మినహాయింపు
కీలక అధికారితో పాటు పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తాత్కాలికంగా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల కార్యాలయాలను మూసేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్‌లైట్స్ విభాగాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా విభాగాల సిబ్బంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment