కర్నూలు: కోవిడ్–19 (కరోనా వైరస్) కేసుల సంఖ్య కర్నూలు నగరంలో క్రమంగా పెరుగుతోంది. గత నెల 28 వరకు ఒక్క కేసూ లేని నగరంలో రెండు వారాల్లోనే ఏకంగా 30కు చేరాయి. మంగళవారం వెలువడిన 9 ‘పాజిటివ్’ కేసులూ నగరానికి సంబంధించినవే కావడం ఆందోళన కల్గించే విషయం. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేస్తున్నారు. గత నెల 28న తొలిసారిగా సంజామల మండలం నొస్సంలో నివాసముండే రాజస్థాన్ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారం వరకు ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ నెల మూడో తేదీ నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 93కు చేరాయి.
అన్నీ ప్రైమరీ కాంటాక్ట్ కేసులే..
మంగళవారం 9 పాజిటివ్ కేసులు తేలాయి. ఇవన్నీ ప్రైమరీ కాంటాక్ట్ కేసులే కావడం గమనార్హం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు ప్రైమరీ కాంటాక్ట్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకున్నట్లయ్యింది. మంగళవారం వెలుగు చూసిన తొమ్మిది కేసుల్లో 5 కర్నూలులోని గనిగల్లిలో, 3 బుధవారపేట, ఒకటి ఎన్‌ఆర్‌పేటలో నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు గనిగల్లిలో 12, బుధవారపేటలో ఆరు కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ఈ రెండు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హైరిస్క్ అలర్ట్ ప్రకటించి, లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు.
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇంటింటికి సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. సర్వేలైన్ టీమ్‌ల ద్వారా ఇంటింటికీ వెళ్లి మెడికల్ స్క్రీనింగ్ వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే రెడ్‌జోన్ ప్రాంతాల్లో హైపో సోడియం క్లోరైడ్ ద్రావణం, బ్లీచింగ్ పౌడర్‌తో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేపడుతున్నారు.
కేసులు ఎక్కడెక్కడంటే..
కర్నూలు నగరంలో నమోదైన 30 కేసుల్లో గనిగల్లిలో 12, బుధవారపేట 6, రోజా వీధి 3, గణేష్ నగర్ 1, ఉస్మానియా కళాశాల రోడ్డు 1, ఖడక్‌పురా 1, కెవీఆర్ గార్డెన్ 1, చిదంబరరావు వీధి 1, పార్కు రోడ్డు 1, రెవెన్యూ కాలనీ 1, పెద్ద పడఖానా 1, ఎన్‌ఆర్‌పేట 1.
Comments
Please login to add a commentAdd a comment