
విజయనగరం : చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు సొంటి వెంకటరావు, సత్యవతి. వీరిది జామి మండలంలోని ఆండ్ర గ్రామం. వెంకటరావుకు పక్షవాతం రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే నిరుపేద కుటుంబం. పోషణ భారంగా మారింది. భర్తను, పిల్లలను పోషించే బాధ్యత సత్యవతిపై పడింది. పనికెళ్తే భర్తను చూసుకునేవారు లేకపోవడంతో జీవనానికి కటకటలాడుతున్నారు. పింఛన్ వస్తే ఆసరా దొరుకుతుందని ఆశించారు.
ఇప్పటికే పలు సార్లు దరఖాస్తుచేసినా మంజూరు కాలేదు. ఇరుగుపొరుగువారి సలహా మేరకు కలెక్టర్ కార్యాలయానికి తన భర్తను ఎత్తుకుని వచ్చింది. తన వేదనను కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వివరించింది. పింఛన్ ఇచ్చి భారం దించాలంటూ ప్రాథేయపడింది. కలెక్టర్ బాబు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం